ప్రపంచ నెంబర్ 1 ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లిన హంపి

మహిళల స్పీడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్ మాస్టర్, ర్యాపిడ్ ప్రపంచ ఛాంపియన్ కోనేరు హంపి సత్తా చాటింది. అద్భుతమైన ఆటతో ఘన విజయం సాధించింది. ప్రపంచ నంబర్‌వన్ హో ఇఫాన్ (చైనా)కు షాకిస్తూ తెలుగమ్మాయి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం(జూలై 17,2020) జరిగిన సెమీస్‌లో హంపి 6-5తో ఇఫాన్‌ను ఓడించింది. ఈ పోరులో తొలి గేమ్ హంపి గెలవగా.. ఆ తర్వాత గేమ్‌ను ఇఫాన్ దక్కించుకుంది. ఆ తర్వాత రెండు గేమ్‌లను హంపి, ఇఫాన్ చెరొకటి నెగ్గడంతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ స్థితిలో ఒత్తిడిని తట్టుకుంటూ నిర్ణయాత్మక గేమ్‌ను గెలిచిన హంపి.. ఫైనల్లోకి ప్రవేశించింది. అలెగ్జాండ్రా కోస్తెనెక్ (రష్యా), సరాసాదత్ (ఇరాన్) మధ్య సెమీస్ విజేతతో హంపి టైటిల్ పోరులో తలపడనుంది.
స్పీడ్ చెస్‌లో ఇప్పటివరకు జరిగిన మొత్తం మూడు గ్రాండ్ ప్రీ టోర్నీల్లో హంపి మొదటి దాంట్లో తొలి రౌండ్లోనే ఓడింది. రొటేషన్ పద్ధతిలో భాగంగా రెండో గ్రాండ్ ప్రీలో ఆమె ఆడలేదు. మూడో గ్రాండ్ ప్రీలో క్వార్టర్స్‌లో ఓడిన హంపి.. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టోర్నీలో ఫైనల్ చేరింది. మొత్తం నాలుగు గ్రాండ్ ప్రీ టోర్నీల్లో పాయింట్ల ఆధారంగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణుల మధ్య జూలై 20న సూపర్ ఫైనల్ జరగనుంది. హంపికి అభిమానులు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఫైనల్లోనూ గెలిచి టైటిల్ నెగ్గాలని ఆకాంక్షించారు.
కాగా, ఈ టోర్నీలో ఇప్పటికే గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం ముగిసింది. క్వార్టర్స్ గేమ్‌లో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక 3-9తో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.