IPL 2025 : ఈ సీజ‌న్‌లో దుమ్ములేపుతున్న కుర్రాళ్లు వీళ్లే.. ప్రియాంశ్ ఆర్య నుంచి ర‌ఘువంశీ వ‌ర‌కు..

ఈ సీజ‌న్‌లో అల‌రిస్తున్న కుర్రాళ్లు ఎవ‌రో ఓ సారి చూద్దాం..

IPL 2025 : ఈ సీజ‌న్‌లో దుమ్ములేపుతున్న కుర్రాళ్లు వీళ్లే.. ప్రియాంశ్ ఆర్య నుంచి ర‌ఘువంశీ వ‌ర‌కు..

Courtesy BCCI

Updated On : April 19, 2025 / 11:46 AM IST

టీ20 అంటేనే కుర్రాళ్ల ఆట‌. ఈ ఫార్మాట్‌లో అత్యుత్త‌మ లీగ్.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ ద్వారా ఎంద‌రో కుర్రాళ్లు వెలుగులోకి వ‌చ్చారు. ఆ త‌రువాత వారు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స్టార్లుగా వెలుగొందారు కూడా. ప్ర‌స్తుత సీజ‌న్‌లో కొంద‌రు కుర్రాళ్లు త‌మ ప్ర‌తిభ చూపిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ సీజ‌న్‌లో త‌మ వైపు అంద‌రి దృష్టిని తిప్పుకున్న కొత్త కుర్రాళ్లు ఎవ‌రో ఓ సారి చూద్దాం..

ప్రియాంశ్ ఆర్య‌..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ప్రియాంశ్ ఆర్య త‌న బ్యాటింగ్‌తో అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. 23 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడు పంజాబ్ కింగ్స్ త‌రుపున ఓపెన‌ర్‌గా అద‌ర‌గొడుతున్నాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 23 బంతుల్లో 47 ప‌రుగులు చేసి ఐపీఎల్ కెరీర్‌ను ఘ‌నంగా మొద‌లెట్టాడు. ఇక చెన్నై మీద త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. కేవ‌లం 39 బంతుల్లోనే సెంచ‌రీ బాదేశాడు.

Courtesy BCCI

ఈ ఐపీఎల్ సీజ‌న్ ఆరంభానికి ముందు ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు కొట్ట‌డంతో ఈ ఆట‌గాడు ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో ప‌డ్డాడు. వేలంలో ఇత‌డి కోసం ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి చివ‌రికి రూ.3.8 కోట్ల‌కు పంజాబ్ సొంతం చేసుకుంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 7 మ్యాచ్‌ల్లో 232 ప‌రుగ‌లు చేశాడు. అత‌డి స్ట్రైక్‌రేట్ 200 పైనే ఉండడం విశేషం.

దిగ్వేశ్‌ సింగ్‌ రాఠి..

దిగ్గ‌జ స్పిన్న‌ర్ సునీల్ న‌రైన్ లాగే బౌలింగ్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు దిగ్వేశ్‌ సింగ్‌ రాఠి. ప‌రుగులు క‌ట్ట‌డి చేయాల‌న్నా, వికెట్ తీయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ప్పుడు కెప్టెన్ రిష‌బ్ పంత్ అత‌డి వైపే చూస్తున్నాడు. ప‌రుగుల వ‌ర‌ద పారుతున్న ఈ సీజ‌న్‌లో దిగ్వేశ్ ఎకాన‌డ‌మీ 7.42 మాత్ర‌మే. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు ఏడు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు.

విప్రాజ్‌ నిగమ్‌..

Courtesy BCCI

ఈ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిల‌క‌డ‌గా విజ‌యాలు సాధిస్తోంది. ఆ జ‌ట్టు విజ‌యాల్లో విప్రాజ్ నిగ‌మ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. కుల్దీప్ యాద‌వ్‌తో క‌లిసి మిడిల్ ఓవ‌ర్ల‌లో ప‌రుగులు నియంత్రిస్తూ వికెట్లు ప‌డ‌గొడుత‌న్నాడు. అంతేకాదండోయ్‌.. బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. ల‌క్నోతో మ్యాచ్‌లో మార్‌క్ర‌మ్ వికెట్ తీయ‌డంతో పాటు భారీ లక్ష్య ఛేద‌న‌లో 39 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో అత‌డి పేరు మారుమోగిపోయింది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 7 వికెట్లు తీశాడు.

సాయి సుద‌ర్శ‌న్..

Courtesy BCCI

ఈ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ త‌రుపున ఆడుతూ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు సాయి సుద‌ర్శ‌న్‌. గ‌త సీజ‌న్ల‌లోనే త‌న‌దైన ముద్ర వేసిన ఈ త‌మిళ‌నాడు కుర్రాడు ఈ సారి మ‌రింత‌గా చెల‌రేగిపోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడ‌గా 54.83 స‌గ‌టుతో 329 ప‌రుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో ప్ర‌స్తుతం అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్ల జాబితాలో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. 357 ప‌రుగుల‌తో నికోల‌స్ పూర‌న్ మాత్ర‌మే అత‌డి క‌న్నా ముందు ఉన్నాడు.

అంగ్క్రిష్ రఘువంశీ..

Courtesy BCCI

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పేరు చెబితే.. ఆండ్రూ ర‌స్సెల్, సునీల్ న‌రైన్ వంటి హిట్ట‌ర్లే గుర్తువ‌స్తారు. అలాంటి హిట్ట‌ర్లు ఉన్న టీమ్‌లో త‌నదైన ముద్ర వేస్తున్నాడు అంగ్క్రిష్ రఘువంశీ. 2022 అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌తో వెలుగులోకి వ‌చ్చిన ఈ ఆట‌గాడు.. అడ్డ‌దిట్టంగా షాట్లు ఆడ‌డు. టెక్నిక్‌, టైమింగ్ ఉప‌యోగించి చ‌క్క‌ని షాట్లు కొడ‌తాడు. వ‌య‌సు త‌క్కువైన‌ప్ప‌టికి కూడా ఎంతో ప‌రిణితి అత‌డి ఆట‌లో క‌నిపిస్తోంది. ఈ సీజ‌న్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ వ‌స్తున్న ఈ ఆట‌గాడు ఇప్ప‌టి వ‌ర‌కు 7 మ్యాచ్‌ల్లో 34 స‌గ‌టుతో 170 ప‌రుగులు చేశాడు.