Milkha Singh : భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ కన్నుమూత

ప్రముఖ అథ్లెట్ దిగ్గజ క్రీడాకారుడు, స్ప్రింటర్ మిల్కా సింగ్ (91) కన్నుమూశాడు. కరోనాతో చికిత్స పొందుతూ మిల్కా తుదిశ్వాస విడిచాడు. గత మే నెల 20న మిల్కా సింగ్ కరోనా బారినపడ్డాడు. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలోకి తరలించారు.

Milkha Singh : భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ కన్నుమూత

Milkha Singh Passes Away (3)

Updated On : June 19, 2021 / 8:32 AM IST

Milkha Singh : ప్రముఖ అథ్లెట్ దిగ్గజ క్రీడాకారుడు, స్ప్రింటర్ మిల్కా సింగ్ (91) కన్నుమూశాడు. కరోనాతో చికిత్స పొందుతూ మిల్కా తుదిశ్వాస విడిచాడు. గత మే నెల 20న మిల్కా సింగ్ కరోనా బారినపడ్డాడు. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలోకి తరలించారు. కొద్ది రోజులు తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. హోం ఐసోలేషన్ లో ఉంటున్న అతడికి ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో పాటు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు మొహలీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించారు. మే 24 న కోవిడ్ న్యుమోనియా కారణంగా ఆయ‌న‌ మొహాలి ఫోర్టిస్ ఆస్పత్రి ఐసీయూలో చేరాడు. అనంతరం జూన్ 3న చండీగర్‌లోని PGIMRకు తరలించారు. కొవిడ్ అనంతర సమస్యల కారణంగా అతని భార్య నిర్మల్‌కౌర్‌ (85) మరణించింది. ఐదు రోజుల తరువాత మిల్కా సింగ్ మరణించాడు. మిల్కా సింగ్ జూన్ 18 రాత్రి 11.30 సమయంలో మరణించినట్టు అతని కుటుంబం ప్రకటించింది.

మిల్కా సింగ్ కు భారత అథ్లెట్ గా మంచి గుర్తింపు ఉంది. కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. 1958లో జరిగిన కామన్ వెల్త్ గేమ్‌లో అంచనాలకు మించి రాణించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో మిల్కా ఫైనల్ చేరాడు. కానీ నాలుగో స్థానానికే పరిమితమయ్యాడు. ఒలింపిక్స్ లో ఫైనల్‌కి చేరిన తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. 1956, 1960, 1964 ఒలింపిక్స్‌లో భారత్‌కి మిల్కాసింగ్ ప్రాతినిధ్యం వహించాడు. పంజాబీ వెటరన్‌కు 1959లో భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ‘ఫ్లయింగ్ సిక్కు’ గా పేరొందిన మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పేరు తెచ్చుకున్నాడు. తన జీవితకాలంలో 80 రేసుల్లో 77 సార్లు విజయం సాధించాడు. విశ్రాంత క్రీడాకారుల వైద్య ఖర్చులకు ట్రస్ట్ నెలకొల్పాడు.. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా బాగ్ మిల్కా బాగ్ అనే చిత్రం తెరకెక్కింది.

1932 నవంబర్‌ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో సిక్‌రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించాడు. 1951లో భారత సైన్యంలో మిల్కాసింగ్‌ చేరాడు. ఆర్మీ నిర్వహించిన పరుగుల పోటీలో మిల్కాసింగ్‌ ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతే అథ్లెట్‌గా అవతరించాడు. హైదరాబాద్‌తో మిల్కా సింగ్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్‌లోనే 9 ఏళ్లపాటు శిక్షణ పొందాడు. అనంతరం 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచాడు. మిల్కాకు కుమారుడు జీవ్ మిల్కా సింగ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మిల్కా సింగ్ మరణం ప‌ట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోదీ ట్వీట్ ద్వారా నివాళులర్పించారు. గొప్ప క్రీడాకారుని కోల్పోయామంటూ మోదీ సంతాపం తెలిపారు. పలువురు కేంద్రమంత్రులు మిల్కా మృతికి సంతాపం ప్రకటించారు. మిల్కా మరణం తనను కలచివేసిందని రాష్ట్రపతి కోవింద్‌ పేర్కొన్నారు. మిల్కా జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్‌షా, పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌ సీఎంలు మమతా బెనర్జీ, అమరిందర్‌ సింగ్‌, క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు మిల్కాసింగ్‌కు నివాళులర్పించారు.

మిల్కా సింగ్ మరణం బాధ కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రపంచ వేదికపై తన అద్భుత ప్రదర్శనల ద్వారా ప్రతి భారతీయుడిని కదిలించాడని కొనియాడారు. మిల్కా సింగ్ జీవితం ఔత్సాహిక భారతీయ అథ్లెట్లను పెద్ద కలలు కనడానికి ముందుకు వెళ్లడానికి ప్రేరేపిస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు.