DC vs LSG : స్టంపౌట్ చేసే ఛాన్స్ మిస్ కావడంపై స్పందించిన రిషబ్ పంత్..
ఢిల్లీతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో స్టంపౌట్ చేసే ఛాన్స్ మిస్ కావడంపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి విశాఖ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు నువ్వానేనా అన్నట్లుగా ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో పంత్ గనుక స్టంపౌట్ చేసి ఉంటే లక్నో గెలిచి ఉండేది. దీనిపై మ్యాచ్ అనంతరం పంత్ స్పందించాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (75), మిచెల్ మార్ష్ (72) లు దంచికొట్టారు. అయితే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రిషబ్ పంత్ పరుగుల ఖాతాను తెరవలేదు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలో కలిసి రాలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39 పరుగులు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయి బౌండరీలతో విరుచుకుపడుతున్న అశుతోష్ శర్మ (66నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి ఢిల్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
The best thing was the decision of Rohit Sharma & Gautam Gambhir to not to play this mug player Rishabh Pant in the Champions Trophy. pic.twitter.com/hn5Mg239mc
— Lordgod 🚩™ (@LordGod188) March 24, 2025
ఆఖరి ఓవర్‌లో స్టంపౌట్ మిస్..
ఆఖరిలో ఓవర్‌లో ఢిల్లీ విజయానికి ఆరు బంతుల్లో 6 పరుగులు అవసరం. క్రీజులో మోహిత్ శర్మ, అశుతోష్ శర్మ ఉన్నారు. ఈ ఓవర్‌ను షాబాజ్ వేశాడు. తొలి బంతికి మోహిత్ శర్మ క్రీజు వదిలి ముందుకు వచ్చి షాట్ ఆడాడు. అయితే.. బంతి బ్యాట్‌ను మిస్ అయి వికెట్ల వైపుగా వచ్చింది. కీపింగ్ చేస్తున్న పంత్ సైతం బంతిని అందుకోలేకపోయాడు. ఒకవేళ ఆ బంతి గనుక దొరికి ఉంటే.. మోహిత్ శర్మ స్టంపౌట్ అయ్యేవాడు. అప్పుడు లక్నో మ్యాచ్ గెలిచేది.
కానీ.. బంతి పంత్‌కు దొరకపోవడంతో మోహిత్ బతికి పోయాడు. రెండో బంతికి అతడు సింగిల్ తీయగా మూడో బంతికి అశుతోష్ సిక్స్ కొట్టి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు.
స్టంపింగ్ మిస్ కావడంపై పంత్ ఏమన్నాడంటే..?
కాగా.. ఆఖరి ఓవర్‌లో స్టంపింగ్ చేసే అవకాశం మిస్ కావడం పై మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ స్పందించాడు. ఆటలో అవన్నీ సహజం అని అన్నాడు. వాటి గురించి పెద్దగా ఆలోచించకూడదు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని చెప్పాడు. ఇక లక్నోకు అదృష్టం కలిసి వచ్చిందన్నాడు.