IND vs PAK : ఓటమికి సాకులు చెప్పిన రిజ్వాన్.. గెలిచే వాళ్లమే కానీ..
భారత్ పై ఓడిపోయిన తరువాత రిజ్వాన్ తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.

Mohammad Rizwan Comments After loss to India In Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్‌కు వరుసగా ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. ఈ ఓటములతో పాక్ ఈ టోర్నీ నుంచి నిష్ర్కమించినట్లే. సాంకేతికంగా మాత్రమే ఆ జట్టు సెమీస్ రేసులో ఉంది.
పాక్‌కు సెమీస్ చేరాలంటే మహాద్భుతాలు జరిగాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో పాటు బంగ్లాదేశ్ పై పాక్ అతి భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు తలా ఓ విజయంతో ఉంటాయి. పాయింట్లు సమానంగా ఉంటాయి. మెరుగైన రన్‌రేటు కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. అయితే.. దాదాపుగా ఇది జరిగే పని కాదు. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్ దాదాపుగా సెమీస్‌కు చేరుకుంది.
టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సౌద్ షకీల్ ( 62; 76 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు)రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ 242 పరుగలు లక్ష్యాన్ని 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. శ్రేయస్ అయ్యర్(56), శుభ్‌మన్ గిల్ (46)లు రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఖుష్‌దిల్ షా లు చెరో ఓ వికెట్ సాధించారు.
మ్యాచ్ అనంతరం ఓటమిపై రిజ్వాన్ స్పందించాడు. టాస్ గెలిచినా కానీ ప్రయోజనం దక్కలేదన్నాడు. ఈ వికెట్ పై 280 మంచి స్కోరు అని తాము భావించామన్నాడు. భారత బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేశారన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా వికెట్లు పడగొట్టి ఒత్తిడిలోకి నెట్టారన్నాడు. తాను, సౌద్ షకీల్ చివరి వరకు ఆడాలని అనుకున్నామని చెప్పుకొచ్చాడు. అయితే.. చెత్త షాట్ సెలెక్షన్‌తో ఔట్ అయినట్లుగా వివరించాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లో విఫలం అయినట్లు రిజ్వాన్ అంగీకరించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో తాము గెలవాలని అనుకున్నామని, అయితే.. ఆ పని చేయలేకపోయినట్లుగా చెప్పాడు. కోహ్లీ, గిల్ లు అద్భుతంగా ఆడారని మెచ్చుకున్నాడు. వారిద్దరు మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారన్నాడు. తాము ఇంకా ఫీల్డింగ్‌లో మెరుగు అవ్వాల్సి ఉందన్నాడు. ఈ మ్యాచ్‌లోనూ, గత మ్యాచ్‌లోనూ ఫీల్డింగ్‌లో చాలా తప్పులను చేశామని మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు.