ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా.. ఈ షాక్ తప్పదా?
టెస్ట్ ఫార్మాట్‌లో ఆడడానికి అతడు ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది.

ఐపీఎల్-2025 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. వచ్చేనెల ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు భారత జట్టును ఈ నెల 23న ప్రకటిస్తారు.
భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్న వేళ బౌలర్ మహ్మద్ షమీ వెళ్తాడా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. టెస్ట్ ఫార్మాట్‌లో ఆడడానికి షమీ ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం షమీ గాయం వల్ల దాదాపు ఏడాదిగా ఆటకు దూరంగా ఉండి, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ షమీ ఆడినప్పటికీ తన స్థాయిలో ఆడలేకపోయాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున షమీ ఆడుతున్నాడు.
అయితే, అంతగా రాణించడం లేదు. పిట్‌నెస్ పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రాక్టీస్‌లో సమయంలో షమీ అలిసిపోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు షమీని ఎంపిక చేయడం కష్టమేనన్న వాదనలు వినపడుతున్నాయి. అతడిని తప్పించి ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.
మరోవైపు, టెస్టు క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా కొత్త కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ ప్రకటించనుంది. టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో శుభ్‌మన్ గిల్ ఇప్పటికే దీనిపై సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.