పాండ్యా ముందు వచ్చుంటే.. మ్యాచ్‌ మరోలా ఉండేది: మహమ్మద్ షమీ

ధోనీ అయినా, కోహ్లి అయినా ప్రతి ఒక్కరి ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. మీ నైపుణ్యాన్ని బట్టి మీరు ఆటలో కొనసాగాలి.

పాండ్యా ముందు వచ్చుంటే.. మ్యాచ్‌ మరోలా ఉండేది: మహమ్మద్ షమీ

Mohammed Shami: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లోనే అపజయాన్ని చవిచూశాడు. అహ్మదాబాద్‌లోని ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆరు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో హార్దిక్ పాండ్యా వ్యవహరశైలిపై క్రీడావర్గాల్లో బాగా చర్చ జరుగుతోంది. తాజాగా టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. పాండ్యా 7వ స్థానంలో కాకుండా కాస్త ముందు బ్యాటింగ్ కు దిగితే బాగుండేదని టీవీ షోలో అన్నాడు.

“గుజరాత్ టైటాన్స్‌ జట్టులో ఉన్నప్పుడు పాండ్యా 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. ముంబై టీమ్ లో 4 లేదా 5 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి ఎందుకు సంకోచిస్తున్నాడో? 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. గత మ్యాచ్‌లో హార్దిక్ ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగేది కాద”ని మహమ్మద్ షమీ అన్నాడు.

పాండ్యా ధోని టెంప్లేట్‌ని ఫాలో అవుతున్నాడా? అని యాంకర్ షమీని అడగ్గా.. “ధోనీ స్టైల్ ధోనీదే. ఒకరిని మరొకరితో పోల్చలేం. ధోనీ అయినా, కోహ్లి అయినా ప్రతి ఒక్కరి ఆలోచనా ధోరణి భిన్నంగా ఉంటుంది. మీ నైపుణ్యాన్ని బట్టి మీరు ఆటలో కొనసాగాలి. మీరు గత రెండు సీజన్లలో పాండ్యా 3, 4 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. ఈ రెండు స్థానాలకు బాగా అలవాటయ్యాడు. ఎక్కువగా 5వ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. అంతేకాని 7వ స్థానంలో పాండ్యా బ్యాటింగ్ చేయడం కరెక్ట్ కాద”ని సమాధానమిచ్చాడు.

Also Read: కెప్టెన్‌గా ఫస్ట్ విన్.. ఎమోషనల్ అయిన శుభ్‌మన్ గిల్ ఫ్యామిలీ మెంబర్స్

ముంబై జట్టులో అలా కుదరదు: మనోజ్ తివారి
అయితే 7వ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న నిర్ణయం పాండ్యా సోలోగా తీసుకున్నది కాదని, టీమ్ మేనేజ్‌మెంట్‌ ప్రకారం అతడు నడుచుకుని ఉంటాడని మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అన్నాడు. “ఇది అతని ఒక్కడి నిర్ణయమే కాదని నేను భావిస్తున్నాను. గుజరాత్‌ జట్టులో హార్దిక్, నెహ్రా మాత్రమే నిర్ణయాలు తీసుకుని ఉంటారని అనుకుంటున్నాను. కానీ ముంబై జట్టులో అలా కాదు. ముంబై డగౌట్‌లో కొంతమంది పెద్దోళ్లు ఉన్నారు. బహుశా వారి నిర్ణయానుసారమే పాండ్యా నడుచకుని ఉంటాడు. ఎందుకంటే వారు తిలక్ వర్మ, బ్రీవిస్ వంటి యువ ఆటగాళ్లపై చాలా పెట్టుబడి పెట్టారు. మార్క్ బౌచర్ స్పష్టంగా సచిన్ మాట వింటాడు. అతడు జట్టు మేనేజ్‌మెంట్‌లోని ఇతర సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాడ”ని మనోజ్ తివారి వివరించాడు.

Also Read: హార్ధిక్ పాండ్యా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కేవిన్ పీటర్సన్, సునీల్ గవాస్కర్