IND vs ENG : రెండో టీ20లో షమీ ఆడతాడా ? ఆడడా? టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ఏంటి?
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ తరువాత టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.

Mohammed Shami Will Play or not in second t20 against england in Chennai
స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ తరువాత టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. చీలమండల గాయం కారణంగా ఆటకు దూరం అయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుని దేశవాళీలో రంజీట్రోఫీ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచులో అతడు బరిలోకి దిగుతాడని అంతా భావించారు. అయితే.. అతడికి తుది జట్టులో స్థానం దక్కలేదు.
షమీని తీసుకోకపోవడానికి గల కారణాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. పిచ్ పరిస్థితుల ఆధారంగా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావించామని అందుకనే షమీని తీసుకోలేదని, ప్రధాన పేసర్‌గా అర్ష్‌దీప్ ను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. తాజాగా షమీ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో షమీ మోకాలికి పట్టీ వేసుకుని కనిపించాడు. అతడు మోకాలిలో స్వల్ప వాపు వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు టీమ్ మేనేజ్‌మెంట్ గానీ, షమీ గానీ ఇంతవరకు స్పందించలేదు.
ఇదిలా ఉంటే.. షమీ ఫిట్‌గా ఉంటే శనివారం చెన్నై వేదికగా జరగనున్న రెండో టీ20 మ్యాచులోనైనా ఆడిస్తారా? లేదా ? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఆంగ్లమీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రెండో టీ20 మ్యాచులోనూ షమీ బెంచీకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కావడంతో భారత జట్టు మరోసారి ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ కే జట్టు మేనేజ్‌మెంట్ ఓటు వేసే అవకాశం ఉంది. అతడు ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టీ20లోనూ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. దీంతో అతడిని తీయలేని పరిస్థితి ఉంది. దాదాపు 14 నెలల తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడే షమీ ఎలాంటి రిథమ్‌లో ఉన్నాడో తెలియదు. దీంతో అర్ష్‌దీప్ కే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపొచ్చు.
IND vs ENG : అదేంటి ఆర్చర్ అంతమాటనేశావ్.. ఇండియా గెలుపు అంత చులకనైపోయిందా నీకు..
ఇక చెన్నై మ్యాచులోనూ విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలో విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే ఆలోచన లేనట్లుగా తెలుస్తోంది. దీంతో మరోసారి షమీ బెంచీపై పరిమితం కావొచ్చు. ఒకవేళ షమీని ఆడించాలని భావిస్తే మాత్రం రవి బిష్ణోయ్ స్థానంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.