Mohammed Siraj : ప్ర‌పంచ నంబ‌ర్ 1 బౌల‌ర్‌గా సిరాజ్‌.. ఏకంగా 8 స్థానాలు ఎగసి..

టీమ్ఇండియా స్టార్ పేస‌ర్‌ మ‌హ్మ‌ద్ సిరాజ్ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో స‌త్తా చాటాడు. తాజాగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్ర‌క‌టించిన వ‌న్డే బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌ లో అగ్ర‌స్థానానికి దూసుకువెళ్లాడు.

Mohammed Siraj : ప్ర‌పంచ నంబ‌ర్ 1 బౌల‌ర్‌గా సిరాజ్‌.. ఏకంగా 8 స్థానాలు ఎగసి..

Mohammed Siraj

Mohammed Siraj No 1 Bowler : టీమ్ఇండియా స్టార్ పేస‌ర్‌, హైద‌రాబాదీ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్ (Mohammed Siraj) వ‌న్డే ర్యాంకింగ్స్‌లో స‌త్తా చాటాడు. తాజాగా అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్ర‌క‌టించిన వ‌న్డే బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌ (ODI bowling rankings) లో అగ్ర‌స్థానానికి దూసుకువెళ్లాడు. ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచులో డ్రీమ్ స్పెల్ వేయ‌డంతో పాటు టోర్నీలో మొత్తం 10 వికెట్లు తీయ‌డంతో ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 694 రేటింగ్ పాయింట్ల‌తో మొద‌టి స్థానానికి చేరుకున్నాడు. ఇంతకు ముందు గత మార్చిలో సిరాజ్ అగ్రస్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు..
శ్రీలంక‌తో జ‌రిగిన ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచులో సిరాజ్ చ‌రిత్ర సృష్టించాడు. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు తీసి ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి భార‌త క్రికెటర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. కేవ‌లం 16 బంతుల్లోనే ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి.. వ‌న్డేల్లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన శ్రీలంక బౌల‌ర్ చ‌మిందా వాస్ రికార్డును స‌మం చేశాడు. మొత్తంగా ఫైన‌ల్ మ్యాచులో 21 ప‌రుగులు ఇచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

678 రేటింగ్ పాయింట్ల‌తో ఆస్ట్రేలియా పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో, 677 రేటింగ్ పాయింట్ల‌తో న్యూజిలాండ్ పేస‌ర్ ట్రెంట్ బౌల్డ్ మూడో స్థానంలో కొన‌సాగుతున్నారు. ఆ త‌రువాత వ‌రుస‌గా అఫ్గానిస్తాన్ బౌల‌ర్లు ముజీబ్ ఉర్ రెహ‌మాన్ (657), ర‌షీద్ ఖాన్ (655) లు ఉన్నారు.

టాప్‌లోనే బాబ‌ర్‌
వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ 857 రేటింగ్ పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. 814 రేటింగ్ పాయింట్ల‌తో శుభ్‌మ‌న్ గిల్ రెండో స్థానంలో ఉండ‌గా, స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లి(708) ఎనిమిదో స్థానంలో రోహిత్ శ‌ర్మ (696) ప‌దో స్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో వ‌న్డేలో 83 బంతుల్లోనే 174 ప‌రుగుల‌తో విరుచుకుప‌డిన ద‌క్షిణాఫ్రికా మిడిల్ ఆర్డ‌ర్ ఆట‌గాడు హెన్రిచ్ క్లాస‌న్ ఏకంగా 20 స్థానాలు ఎగ‌బాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.

Asia Cup 2023: కోహ్లీ అభిమానిగా మారిన శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే..! ఇన్‌స్టా డీపీ‌లో ఫొటో వైరల్