ధోనీ చెప్తే కళ్లు మూసుకుని బౌలింగ్ చేసేస్తా: జాదవ్

టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ.. కెప్టెన్‌గా ఉన్నప్పుడే కాదు. రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఆటలో తనదే ఆధిపత్యం. తన వ్యూహాలను తూచా తప్పకుండా పాటిస్తాడు విరాట్ కోహ్లీ. జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏ ప్లేయర్‍ను ఎక్కడ వినియోగించుకోవాలో సరిగ్గా ప్రయోగించిన ధోనీ.. ఇప్పటికీ అదే తరహాలో జట్టుకు సూచనలిస్తుంటాడు. ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఒక్క వికెట్ అయినా ధోనీ చెప్పినట్లు అవుట్ అవ్వాల్సిందే. బౌలర్లకు అలా పనిచేస్తుంటాయి అతను చేసే సూచనలు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బౌలర్లు విజృంభిస్తున్నారు.
అయితే ఈ సిరీస్‌లోనూ యథావిధిగా ధోనీ మాటలను అనుసరించి వికెట్లు కొల్లగొడుతున్నారు బౌలర్లు. రెండో వన్డేలో రాస్ టేలర్‌ను ధోనీ మెరుపువేగంతో స్టంపౌట్ చేసిన విధానం మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ ఓవర్లో బౌలింగ్ వేసిన కేదర్ జాదవ్ ధోనీ గురించి చెప్తూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు.
‘నా ప్రదర్శనకు ధోనీనే కారణం. ధోనీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాడు. జింబాబ్వే, న్యూజిలాండ్ సిరీస్‌లో ధోనీ నా ఆటను మొదట గుర్తించాడు. రెండు ఓవర్లకు బాల్ అందించగా..అదృష్టం కొద్ది, రెండో ఓవర్‌లోనే 2 వికెట్లు తీయగలిగాను. ధోనీ చెప్పిన చోట కళ్లు మూసుకొని బౌలింగ్ చేసేస్తా. అప్పుడు కచ్చితంగా వికెట్లు పడతాయి.
‘పార్ట్ టైమ్ బౌలర్‌గా ఎప్పుడు ఒత్తిడికి గురికాలేదు. నేను మెయిన్ స్పిన్నర్ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎక్కువ పరుగులు ఇవ్వని పార్ట్ టైమ్ బౌలర్‌గా ఉండటానికే కృషి చేస్తా. కెప్టెన్ కూడా బంతి ఇచ్చేటప్పుడు అదే చెప్తారు. వికెట్ పడితే అది బోనస్. కొన్నిసార్లు పార్ట్ టైమ్ బౌలర్లను బ్యాట్స్‌మెన్ తక్కువ అంచనా వేస్తారు. అప్పుడే నాకు అదృష్టం కలిసివస్తుంది’ అని వెల్లడించాడు. గతంలో కుల్‌దీప్, చాహల్ కూడా తమ ఆటతీరును మెరుగుపరుచుకోవడంలో ధోనీ సహకరించాడని వెల్లడించారు.