Navdeep Saini : అస్సలు ఊహించలేదు.. ఎంపికయ్యానని తెలిసి ఆశ్చర్యపోయా..!
జూలై 12 నుంచి వెస్టిండీస్(West Indies )లో టీమ్ఇండియా(Team India) పర్యటన ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే, టెస్టు జట్టును సెలక్టర్లు ప్రకటించారు

Navdeep Saini
Navdeep Saini surprised : జూలై 12 నుంచి వెస్టిండీస్(West Indies )లో టీమ్ఇండియా(Team India) పర్యటన ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే, టెస్టు జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వన్డే జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చోటు చేసుకున్నాయి. అనూహ్యాంగా ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ(Navdeep Saini )కి చోటు కల్పించారు. వెస్టిండీస్ పర్యటకు ఎంపిక అవుతానని తాను అస్సలు ఊహించలేదని సైనీ తెలిపాడు. రెండోసారి విండీస్ పర్యటనకు వెళ్లనుండడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే.. అప్పట్లో తనకు తుది జట్టులో స్థానం దక్కలేదని ఈ సారి మాత్రం అవకాశం వస్తే సత్తా చాటుతానన్నాడు.
నవదీప్ సైనీ 2019లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అరంగ్రేటం చేశాడు. ఆ తరువాత రెండేళ్లకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2021 లో భాగంగా జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో సైతం అడుగుపెట్టాడు. అదే అతడి చివరి సిరీస్. ఆ తరువాత మరోసారి టెస్టు మ్యాచ్ ఆడలేదు. దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత ఎంపిక కావడం జరిగింది.
ప్రస్తుతం సైని కౌంటీ మ్యాచ్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్ కు వెళ్లాడు. ఈ క్రమంలోనే అతడికి పిలుపు రావడం గమనార్హం. కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వచ్చాను. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో తాను విండీస్ పర్యటనకు ఎంపిక అయిన విషయం తెలిసిందని సైనీ తెలిపాడు. ఇది అస్సలు తాను ఊహించలేదన్నాడు. ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు నెట్ బౌలర్‌గా లేదంటే స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక అవుతానని బావించినట్లు చెప్పాడు.
అందుకోసమనే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో డ్యూక్ బాల్‌తో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు ఇంగ్లాండ్‌లో ఓ కౌంటీ మ్యాచ్ ఆడనున్నట్లు తెలిపాడు. ఇది తనకు మ్యాచ్ ప్రాక్టీస్‌గా ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. వెస్టిండీస్‌లో వాతావరణం, పిచ్‌లపై తనకు మంచి అవగాహాన ఉందని, ఈ సారి తుది జట్టులో అవకాశం వస్తే మాత్రం సత్తా చాటనున్నట్లు తెలిపాడు.
నవదీప్ సైనీ ఇప్పటి వరకు టీమ్ఇండియా తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. టెస్టుల్లో నాలుగు, వన్డేల్లో ఆరు, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో 32 మ్యాచులు ఆడి 23 వికెట్లు తీశాడు.