Naveen Ul Haq : నవీన్ ఉల్ హక్ పై 20 నెలల నిషేదం.. మ్యాంగో మ్యాన్ చేసిన తప్పేంటి..?
ఐపీఎల్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో గొడవ పడడంతో దాదాపుగా అందరికి నవీన్ ఉల్ హక్ గురించి తెలిసిపోయింది.

Naveen ul Haq banned from ILT20 for 20 months
అఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. గతేడాది ఐపీఎల్‌లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీతో గొడవ పడడంతో దాదాపుగా అందరికి అతడి గురించి తెలిసిపోయింది. గొడవ నేపథ్యంలో అతడు కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురైయ్యాడు. ఆ సమయంలో అతడు సోషల్ మీడియాలో పలు మామిడి పండ్ల ఫోటోలను పోస్ట్ చేయడంతో చాలా మంది అతడిని మ్యాంగో మ్యాన్ అని పిలుస్తున్నారు. కాగా.. తాజాగా అతడికి భారీ షాక్ తగిలింది. ఐఎల్‌టీ20 (ఇంటర్నేషనల్ టీ20 లీగ్) అతడిపై 20 నెలల పాటు నిషేదాన్ని విధించింది.
ఐఎల్‌టీ20 అనేది దుబాయ్ వేదికగా జరిగే టీ20 లీగ్. ఈ లీగ్‌లో నవీన్ ఉల్ హక్ షార్జా వారియర్స్ తరుపున ఆడుతున్నాడు. అయితే.. ప్రాంఛైజీతో అతడు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లీగ్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే అతడిపై 20 నెలల పాటు నిషేదం విధిస్తున్నట్లు పేర్కొన్నది.
నవీన్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐఎల్‌టీ20 మొదటి సీజన్‌లో షార్జా వారియర్స్ తరుపున ఆడాడు. మంచి ప్రదర్శననే చేశాడు. తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. దీంతో ముందస్తు ఒప్పందంలో భాగంగా సీజన్ 2లో ఆడతానని సంతకం చేయాలని ప్రాంఛైజీ అతడిని కోరింది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్‌ను అతడికి పంపించింది. అయితే.. అగ్రిమెంట్‌లో సంతకం చేసేందుకు అతడు నిరాకరించాడు.
దీనిపై పలుమార్లు అతడితో మాట్లాడినా ఎటువంటి ఫలితం లేకపోయింది. దీంతో షార్జా వారియర్స్ జట్టు మేనేజ్‌మెంట్ ఐఎల్‌టీ20 క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేసింది. దీనిపై ఐఎల్‌టీ20 క్రమశిక్షణా కమిటీ విచారణ చేపట్టింది. అప్పటికీ కూడా అతడు సంతకం చేసేందుకు నిరాకరించడంతో నవీన్‌పై 20 నెలల నిషేధం విధించింది. ఈ నిషేదం కారణం నవీన్ రెండు సీజన్ల పాటు ఐఎల్‌టీ20 లో ఆడేందుకు అవకాశం లేదు.
Also Read: కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించారని ముంబైని వీడనున్న సచిన్..?
అయితే.. అతడిని ఇతర లీగులు అయిన ఐపీఎల్, బిగ్‌బాష్, ది హండ్రెడ్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగుల్లో చూడొచ్చు. కాగా.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం వన్డే క్రికెట్‌కు నవీన్ వన్డే క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.