BCCI : ప్రపంచకప్ గెలిచినా విక్టరీ పరేడ్ లేదా..? ఇదేందయ్యా.. అప్పుడు పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలవగానే..
భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచినప్పటికి కూడా విజయోత్సవ ర్యాలీని నిర్వహించేందుకు బీసీసీఐ (BCCI ) ఇంకా ప్లాన్ చేయలేదు.
                            No Victory Parade Planned For Womens World Cup Winning Indian Team Yet
BCCI : భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాప్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత మహిళల జట్టు విశ్వవిజేతగా నిలిచినప్పటికి కూడా విజయోత్సవ ర్యాలీని నిర్వహించేందుకు బీసీసీఐ ఇంకా ప్లాన్ చేయలేదు.
ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ (BCCI) సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తెలిపారు. ఇందుకు ఓ కారణం ఉందన్నారు. నవంబర్ 4 నుంచి 7 వరకు దుబాయ్‌లో ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో తనతో పాటు పలువురు బీసీసీఐ సీనియర్ అధికారులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశాల్లో పాల్గొని తిరిగి వచ్చిన తరువాతనే విజయోత్సవ ర్యాలీని పై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. అమెరికా, వెస్టీండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్ 2024ను భారత పురుషుల జట్టును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ను అందుకున్న తరువాత రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టు భారత్‌కు చేరుకున్న తరువాత నిర్వహించిన విక్టరీ పరేడ్‌ను అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు.
ఆసియాకప్‌ను తీసుకువస్తారా ?
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఓడించి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఆసియాకప్ 2025 విజేతగా నిలిచింది. అయినప్పటికి కూడా ఇంకా కప్పును భారత్ అందుకోలేదు. ఈ విషయం పై కూడా దేవ్‌జిత్ సైకియా మాట్లాడారు. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. ట్రోఫీని గౌరవప్రదమైన మార్గంలో తిరిగి తెచ్చుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
