Pratika Rawal : అయ్యో ప్రతీకా.. నీకు కనీసం పతకం కూడా ఇవ్వలేదా.. జట్టు కోసం 308 పరుగులు చేసినా..
ప్రతీకా రావల్‌కు (Pratika Rawal) విన్నింగ్ మెడల్ ను ఇవ్వలేదు. ఇందుకు గల కారణం ఏంటి అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Why did Pratika Rawal not get the World Cup medal
Pratika Rawal : మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి తొలిసారి వన్డే ప్రపంచను ముద్దాడింది. ఐసీసీ ఛైర్మన్ జై షా నుంచి టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను కప్పును అందుకున్న క్షణాన్ని భారత అభిమానులు ఇప్పట్లో మరిచిపోలేరు. ఈ సమయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అదే సమయంలో విజేతగా నిలిచిన జట్టు సభ్యులకు విన్నింగ్ మెడల్స్‌ను అందజేశారు.
టీమ్ఇండియా తొలి సారి వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువ ఓపెనర్ ప్రతీకా రావల్ పాత్ర కూడా ఉంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఏడు మ్యాచ్‌ల్లో 51.33 సగటుతో 308 పరుగులు చేసింది. అయినప్పటికి కూడా ప్రతీకా రావల్‌కు విన్నింగ్ మెడల్ ను ఇవ్వలేదు. ఇందుకు గల కారణం ఏంటి అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
IND vs AUS : నాలుగో టీ20 ముందు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. భారత్‌కు బంపర్ ఆఫరే ఇది..!
జట్టుకు దూరం కావడంతో..
ఈ మెగాటోర్నీలో ప్రతీకా రావల్ మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆమె గాయపడింది. దీంతో బీసీసీఐ ఆమె స్థానంలో షెఫాలీ వర్మను ఎంపిక చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం విన్నింగ్ జట్టులోని 15 మంది సభ్యులకు మాత్రమే పతకాలు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకా పతకానికి దూరం అయింది. ఒకవేళ ఆమె స్థానంలో ఎవరిని తీసుకోకుండా ఉండి ఉంటే ఆమెకు పతకం వచ్చేది.
ఇక ప్రతీకా రావల్ స్థానంలో వచ్చిన షెఫాలీ వర్మ సెమీ ఫైనల్‌లో విఫలమైంది. అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో 87 పరుగులు చేయగా బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసింది.
వీల్‌ఛైర్‌లో వచ్చి..
ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా గెలిచిన తరువాత మైదానంలోకి వీల్‌ఛైర్‌తో వచ్చింది ప్రతీకా రావల్. ప్లేయర్లతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ తరువాత మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. టీమ్ఇండియా ప్రపంచకప్ విజయం సాధించడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందంది. ఈ విజయాన్ని వర్ణించడానికి తనకు మాటలు రావడం లేదంది. ఇక తన భుజం పై ఈ జెండా కలిగి ఉండడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
