IND vs PAK : ఇండియన్ ప్లేయర్ల విషయంలో పాక్ క్రికెటర్లకు మాజీ కెప్టెన్ వార్నింగ్
పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ వార్నింగ్ ఇచ్చాడు.

Pakistan Cricketers Warned By Ex Captain Moin Khan
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ఆటగాళ్లు కూడా మైదానంలో హోరాహోరీగా తలపడుతుంటారు. గత కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ మెగాటోర్నీల్లో మాత్రమే ఈ రెండు దేశాలు తలపడుతున్నాయి. ఇక అభిమానులు సైతం తమ జట్టు మెగాటోర్నీ విజేతగా నిలవకున్నా ఫర్వాలేదు గానీ ఈ మ్యాచ్‌లో విజేతగా నిలవాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటారు.
అభిమానులు ఇలా ఉంటే.. ఆటగాళ్లు ఎలా ఉంటారు అన్న సందేహం కలగడం కామన్. అభిమానులు ఎలా ఉన్నా సరే తాము మాత్రం స్నేహపూర్వకంగానే ఉంటామని, మైదానంలో మాత్రమే తాము ప్రత్యర్థులం తప్ప బయట కాదు అని పలు సందర్భాల్లో ఇరు దేశాల క్రికెటర్లు వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మోయిన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Siraj – Mahira sharma : మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్.. స్పందించిన సానియా..
మైదానంలో పాకిస్థాన్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లతో స్నేహపూర్వకంగా ఉండవద్దని సూచించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై తనకెలాంటి అగౌరవం లేదని, కాకపోతే మైదానంలో మాత్రం స్నేహంగా ఉండకూడదన్నాడు. ఇటీవల కాలంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను చూస్తున్నప్పుడు తనకు ఓ విషయం అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినప్పుడు పాక్ ఆటగాళ్లు వెళ్లి వారి బ్యాట్లను చెక్ చేయడం, వారి భుజాలను తట్టడం, స్నేహంగా మాట్లాడడం వంటివి చేస్తున్నారు. అలా వారు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదన్నారు.
గతంలో తమ సీనియర్ ఆటగాళ్లు ఒకటే చెప్పేవారన్నాడు. టీమ్ఇండియాతో బరిలోకి దిగినప్పుడు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదన్నారు. గ్రౌండ్‌లో వారితో స్నేహం చేయకూడదని సూచించారు. ఎప్పుడైతే మనం స్నేహపూర్వకంగా ఉంటామో అది మన బలహీనత అనుకునే ప్రమాదం లేకపోలేదని మోయిన్ అన్నాడు.
SL vs AUS : ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే ఒక ఆసీస్ ఆటగాడు
తన తరంలోని కొంత మంది భారతీయ ఆటగాళ్లపై తనకు అపారమైన గౌరవం ఉందని, అయితే మైదానంలో ఎప్పుడూ దానిని చూపించలేదని చెప్పాడు. మైదానంలో అలా ఉండడం వల్ల అనవసరంగా ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. ప్రపంచకప్ వంటి మ్యాచుల్లో భారత్ ను ఓడించలేకపోవడం తమ తరం నుంచి ఆటగాళ్లకు అతి పెద్ద పశ్చాత్తాపమని చెప్పాడు.
పాకిస్థాన్ తరుపున మోయిన్ 69 టెస్టులు, 219 వన్డేలు ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో పాకిస్థాన్, భారత్ లు రాణిస్తాయని చెప్పాడు.