WI vs ENG : టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్‌లో కాసుల పంట!
ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ అరుదైన ఘనత సాధించాడు.

Phil Salt Shatters Huge Record
WI vs ENG : ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ అరుదైన ఘనత సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అనంతరం అతడు ఈ ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అతడికి ఇది మూడో సెంచరీ. కాగా.. ఈ మూడు సెంచరీలను అతడు విండీస్ పైనే చేయడం గమనార్హం. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అన్ని సెంచరీలను ఒకే జట్టు పై చేసిన ఏకైక బ్యాటర్‌గా ఫిల్ సాల్ట్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు 34 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన సాల్ట్ మూడు శతకాలు, మూడు అర్థశతకాలు సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ (38), రొమారియో షెపర్డ్ (35 నాటౌట్), గుడాకేష్ మోతీ (33), ఆండ్రీ రస్సెల్ (30) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ నాలుగు వికెట్లు తీశాడు. ఆదిల్ రషీద్ రెండు వికెట్లు సాధించాడు.
అనంతరం ఫిల్ సాల్ట్ (103 నాటౌట్; 54 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర శతకం బాదడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 16.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అతడితో పాటు జాకబ్ బెతెల్ (58 నాటౌట్ ; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు.
ఐపీఎల్‌లో కాసుల పంటే!
ఫిల్ సాల్ట్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సునీల్ నరైన్‌తో కలిసి ఓపెనర్‌గా జట్టుకు మెరుపు ఆరంభాలను ఇచ్చాడు. అయితే.. రిటెన్షన్‌లో అతడికి చోటు దక్కలేదు. దీంతో అతడు వేలంలోకి వచ్చాడు. మరో రెండు వారాల్లో వేలం జరగనుంది. ఈ క్రమంలో సెంచరీ చేయడంతో అతడిని దక్కించుకునేందుకు ప్రాంఛైజీలు పోటీపడతాయనడంలో సందేహం లేదు.