Gautam Gambhir : గంభీర్‌కు లాస్ట్ ఛాన్స్! బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవకుంటే.. టెస్టులకు కొత్త కోచ్..?
రాహుల్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు అందుకున్నాడు గౌతమ్ గంభీర్.

Gambhir out New Coach To Take In Case Of Poor BGT Results report
రాహుల్ ద్రవిడ్ నుంచి కోచింగ్ బాధ్యతలు అందుకున్నాడు గౌతమ్ గంభీర్. ద్రవిడ్ హయాంలో ఓ వెలుగు వెలిగిన భారత జట్టు గంభీర్ మార్గనిర్దేశంలో మరెంతో ముందుకు వెలుతుందని చాలా మంది భావించారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్‌ను అందించిన గంభీర్‌కు టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా ఏమీ కలిసి రావడం లేదు. 27 ఏళ్ల తరువాత శ్రీలంకలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ కావడం వంటి చేదు అనుభవాలు ఎదురుఅయ్యాయి.
స్వదేశంలో కివీస్‌తో టెస్టు సిరీస్‌లో 0-3తో టీమ్ఇండియా వైట్ వాష్ కావడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమీక్ష నిర్వహించింది. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్‌లను సిరీస్ ఓటమికి గల కాణాలు, కొన్ని నిర్ణయాలపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘ భేటీ జరిగింది.
దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. గౌతమ్ గంభీర్‌కు ఆస్ట్రేలియా సిరీస్ చాలా కీలకం కానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయకుంటే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. గంభీర్‌ను కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే.. అది టెస్టులకు మాత్రమేనని, వన్డేలకు, టీ20లకు అతడినే కోచ్‌గా కొనసాగించవచ్చునని అందులో తెలిపింది.
టెస్టులకు వీవీఎస్ లక్ష్మణ్ వంటి స్పెషలిస్ట్‌లను కోచ్‌గా ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే.. ఇలాంటి మార్పునకు గంభీర్ అంగీకరిస్తాడో లేదో ఇంకా తెలియలేదు. ఏదీ ఏమైనప్పటికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గంభీర్ కు అగ్ని పరీక్షే కానుంది. భారత జట్టు 4-0 తేడాతో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
ప్రస్తుతం టీమ్ఇండియా ఉన్న పరిస్థితుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోచించ వద్దని, కనీసం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకున్నా తాను ఎంతో సంతోషిస్తానని ఇప్పటికే దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చెప్పిన సంగతి తెలిసిందే.