Sanju Samson : దక్షిణాఫ్రికాపై సెంచరీ.. సంజు శాంసన్ ఎమోషనల్.. ఈ క్షణం కోసం 10 ఏళ్లుగా ఎదురుచూశా..
దక్షిణాఫ్రికా గడ్డపై దుమ్మురేపాడు సంజు శాంసన్.

Sanju Samson Emotional Confession After Heroic Durban Century
Sanju Samson : దక్షిణాఫ్రికా గడ్డపై దుమ్మురేపాడు సంజు శాంసన్. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు బాదాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు చేసిన తొలి భారత బ్యాటర్ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది.
ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ సంజు శాంసన్ ఎమోషనల్ అయ్యాడు. తనకు సక్సెస్ అంత సులువుగా రాలేదని, ఈ క్షణం కోసం 10 ఏళ్లుగా ఎదురుచూసినట్లు చెప్పుకొచ్చాడు. వ్యక్తిగత ప్రదర్శన గురించి ఆలోచించకుండా జట్టు కోసం ఆడినట్లు తెలిపాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
బ్యాటింగ్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటానని శాంసన్ అన్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. ప్రస్తుతం తన ఫామ్ కొనసాగిస్తున్నానని చెప్పాడు. దూకుడుగా ఆడాలనే భావతోనే క్రీజులోకి వస్తానన్నాడు. అయితే.. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు. మొదటి మూడు, నాలుగు బంతుల్లోనే బౌండరీ కొట్టాలని చూస్తానన్నాడు.
అయితే.. కొన్ని సార్లు ఇది వర్కౌట్ అవుతుందని, మరికొన్ని సార్లు కాదన్నాడు. దక్షిణాఫ్రికాకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నాడు. సొంత గడ్డ పై ఆ జట్టు ఎంత ప్రమాదకారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నాడు. ప్రస్తుత సిరీస్‌లో శుభారంభం చేయడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఇక పై కూడా ఇలాంటి ఆటనే ఆడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
10 ఏళ్లు ఎదురుచూశా..
నేను ఎక్కువగా ఆలోచిస్తే కన్నీళ్లు వస్తాయి. ఈ క్షణం కోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ అంత సులువుగా రాలేదు. ఎంతో కష్టపడ్డాను. ప్రస్తుతం చాలా సంతోసంగా ఉన్నాను. నేను కోరుకున్నది దక్కింది. గొప్ప అదృష్టవంతుడిగా ఫీలవుతున్నాను అని చెబుతూ సంజు శాంసన్ ఎమోషనల్ అయ్యాడు.