Wrestlers-PT Usha: వీధుల్లోకి ఎందుకొచ్చారంటూ మొన్న ఆగ్రహం.. ఇప్పుడు వారివద్దకే వెళ్లి పరామర్శ

Wrestlers-PT Usha: రెజ్లర్లతో మాట్లాడుతూ పీటీ ఉష కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీడియాతో మాత్రం మాట్లాడలేదు.

Wrestlers-PT Usha: వీధుల్లోకి ఎందుకొచ్చారంటూ మొన్న ఆగ్రహం.. ఇప్పుడు వారివద్దకే వెళ్లి పరామర్శ

Wrestlers-PT Usha

Updated On : May 3, 2023 / 3:19 PM IST

Wrestlers-PT Usha: భారత రెజ్లర్లు (Wrestlers) వీధుల్లోకి వచ్చి దేశ పరువు తీస్తున్నారంటూ ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (Indian Olympic Association) అధ్యక్షురాలు పీటీ ఉష (PT Usha) ఇవాళ రెజ్లర్ల వద్దకు వెళ్లారు. ఆందోళన తెలుపుతున్న రెజ్లర్లను పరామర్శించి, వారికి మద్దతు ప్రకటించారు. 2022, డిసెంబరు నుంచి పీటీ ఉష ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కు అధ్యక్షురాలి ఉంటున్న విషయం తెలిసిందే.

ఇటీవల రెజ్లర్ల ఆందోళనపై ఆమె స్పందిస్తూ.. వారు వీధుల్లోకి వచ్చి ఆందోళన తెలపకపోతే బాగుండేదని చెప్పారు. వారి తీరు క్రీడారంగానికి, దేశానికి మంచిది కాదని, వారి చర్య క్షమశిక్షణారాహిత్యమని చెప్పారు. ఇవాళ పీటీ ఉష ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వెళ్లి రెజ్లర్లను పరామర్శించారు.

పీటీ ఉష రెజ్లర్లతో మాట్లాడుతూ.. తాను ఇటీవల రెజ్లర్ల గురించి చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. రెజ్లర్లను కలిసిన తర్వాత పీటీ ఉష మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రెజ్లర్ బజరంగ్ పునియా (Bajrang Punia) మీడియాతో మాట్లాడుతూ… “తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను మొదట అథ్లెట్ నని, ఆ తర్వాతే మిగతా పదవుల్లో చేరానని చెప్పారు” అని వివరించారు.

తాము కేవలం డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై మాత్రమే పోరాడుతున్నామని, రెజ్లర్ల శ్రేయస్సు కోసమే ఆందోళనకు దిగామని అన్నారు. కాగా, న్యాయం కోసం భారత టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇటీవల పీటీ ఉష చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

పీటీ ఉష ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ గా ఉండడంతో ఆమె నుంచి తమకు మద్దతు వస్తుందని తాము భావించామని రెజ్లర్లు ఇటీవల అన్నారు. రాజకీయ ప్రముఖులు, సినీనటులు కూడా పీటీ ఉషపై తీవ్ర విమర్శలు చేశారు.

PT Usha: పరుగుల రాణి పీటీ ఉషపై 3 రోజుల నుంచి ఎందుకు మరీ ఇంతలా విమర్శలు?