క్రీడామంత్రిని కలిసిన స్వర్ణ విజేత సింధు

క్రీడామంత్రిని కలిసిన స్వర్ణ విజేత సింధు

Updated On : August 27, 2019 / 7:00 AM IST

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించిన పీవీ సింధు భారత్‌కు తిరిగి వచ్చారు. సోమవారం రాత్రి స్విట్జర్లాండ్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం అందుకుంది. మంగళవారం ఉదయం సింధు, కోచ్‌ గోపీచంద్‌ కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజును కలిశారు. 

ఆదివారంతో ముగిసిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర లిఖించింది. వరల్డ్ ఐదో ర్యాంకర్‌ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై అద్భుత విజయం సాధించింది. కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లో నిలిచింది. 

పీవీ సింధుకు బాయ్‌ రూ. 20 లక్షలు నగదు అందజేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధు ఖాతాలో 13 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు చేరాయి. చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ దక్కలేదు. విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఈ విజయంతో ఒకుహరాపై ముఖాముఖి రికార్డులో సింధు ఆధిక్యాన్ని 9-7కు పెంచుకుంది.