పరుగుల వరదలో రాజస్థాన్‌దే పైచేయి.. పంజాబ్‌పై 4వికెట్ల తేడాతో గెలుపు

RR vs KXIP, IPL 2020: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో 9 వ మ్యాచ్ షార్జా మైదానంలో రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరగగా.. RR vs KXIP మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. పరుగుల వరదలో చివరకు రాజస్థాన్ రాయల్స్ పంజాబ్‌పై పైచేయి సాధించింది. రాజస్థాన్ జట్టు పంజాబ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. ఐపిఎల్ చరిత్రలో అతిపెద్ద రన్ చేజ్ సాధించింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచిన తరువాత పంజాబ్‌పై మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మయాంక్ అగర్వాల్ (106) తుఫాను సెంచరీ, కెఎల్ రాహుల్ (69) అర్ధ సెంచరీల సహాయంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 పరుగులు చేసింది. చివరకు మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్‌కు 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 19.3ఓవర్లలో 226పరుగులు చేసి పంజాబ్‌ను ఓడించింది.
మయాంక్ అగర్వాల్ జట్టుకు 50 బంతుల్లో 106 పరుగులు చేశాడు, అందులో 10 ఫోర్లు, ఏడు సిక్సర్లు కొట్టాడు. ఆయనతో పాటు కెప్టెన్ లోకేష్ రాహుల్ ఏడు బంతుల్లో 69 పరుగులు, 54 బంతుల్లో ఒక సిక్సర్ అందించాడు. ఇద్దరు బ్యాట్స్ మెన్ మొదటి వికెట్‌కు 183 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నికోలస్ పురాన్ 25 నాటౌట్, గ్లెన్ మాక్స్‌వెల్ 13 నాటౌట్ ఇన్నింగ్స్ పూర్తి చేశారు.
లేటెస్ట్ విజయంతో IPL 2020లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పవర్ ప్లేలో 6 ఓవర్లు పూర్తయ్యే సమయానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 69 పరుగులు చేసింది. అయితే, జట్టు స్కోర్ 100 పరుగులకు చేరిన తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఔట్ అయ్యాడు. 27 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 పరుగులు చేసిన స్మిత్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఆ తర్వాత సంజు శాంసన్, స్టీవ్ స్మిత్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ తివాతియా ఇన్నింగ్స్ కొనసాగించారు. మొదట చాలా పేలవమైన ఆటతో రాహుల్ తివాతియా విసుగు పుట్టించినా.. చివర్లో కాట్రెల్ ఓవర్‌లో 30పరుగులు తీసి మ్యాచ్ విన్నింగ్‌లో కీలక పాత్ర వహించాడు. వాస్తవానికి 10 ఓవర్ల వరకు రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి రాజస్థాన్ జట్టు స్కోర్ 104గా ఉంది.
అదే 15 ఓవర్లు పూర్తయ్యే సరికి జట్టు స్కోర్ 140కి చేరింది. 15 ఓవర్ తర్వాత సంజూ శాంసన్ స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాడు. 16వ ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టాడు. అయితే, 17వ ఓవర్ ఫస్ట్ బంతికే 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ (42 బంతుల్లో 85, 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) వద్ద సంజూ శాంసన్ ఔట్ అయ్యాడు. షమీ వేసిన బంతిని అనవసరంగా టచ్ చేసి అవుట్ అయ్యాడు శాంసన్. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో పడింది.
సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత రాహుల్ తివాతియా చెలరేగి పోయి ఆడాడు. కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టగా… ఆ ఓవర్లో మొత్తం 30 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ మ్యాచ్ గెలుపులో కీలకం అయ్యింది. వాస్తవానికి అంతకు ముందు 22బంతుల్లో కేవలం 14పరుగులు చేసిన తివాతియా సంజూశాంసన్ సహనానికి కూడా పరీక్ష పెట్టాడు. ఒకానొక సమయంలో శాంసన్ లాంగ్ ఆన్‌కి బాల్ కొట్టినా కూడా పరుగు తిరగలేదు.
ఇక షమీ బౌలింగ్‌లో రాబిన్ ఊతప్ప (9 పరుగులు. 2 ఫోర్లు) ఇచ్చిన క్యాచ్‌ను పూరన్ అందుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ 4వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తివాతియా (31 బంతుల్లో 53 పరుగులు, 7 సిక్స్‌లు) కూడా షమీ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. ఆ సమయంలో వచ్చిన జోఫ్రా ఆర్చర్ మూడు బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 13పరుగులు కొట్టాడు. ఇక ఆరు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉన్న సమయంలో 20వ ఓవర్లో రెండో బంతికి పరాగ్ ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కరణ్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.