RCB vs DC : సొంత గడ్డపై వరుసగా రెండో ఓటమి.. మేము చేసిన తప్పు అదే.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కామెంట్స్..
ఢిల్లీ చేతిలో ఓటమి పట్ల ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు.

Courtesy BCCI
అదేమీ సిత్రమో.. ఈ సీజన్‌లో బయటి వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మాత్రం చతికిలపడుతోంది. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గురువారం చిన్నస్వామి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం తనకు బాధను కలిగించిందని ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అన్నాడు.
మ్యాచ్ అనంతరం బెంగళూరు ఓటమి పై కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. పిచ్ తాము అనుకున్నట్లుగా లేదన్నాడు. పిచ్‌ను అంచనా వేయడంలో కాస్త పొరబడినట్లు తెలిపాడు. ఇది మంచి బ్యాటింగ్ వికెట్ అని అనుకున్నామని, అయితే.. తాము సరిగ్గా బ్యాటింగ్ చేయలేదన్నాడు. బ్యాటర్లు మంచి టెంపర్ మెంట్‌తో ఆడుతున్నారు. అయితే.. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందన్నాడు. వికెట్ నష్టానికి 80 పరుగులతో ఉండి.. 90 పరుగలకే నాలుగు వికెట్లు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదు. అని రజత్ పాటిదార్ అన్నాడు.
IPL 2025: అయ్యో.. కొంపముంచావ్ కదయ్యా పాటిదార్.. విరాట్ కోహ్లీ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్
తమకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, అయినప్పటికి పరిస్థితులకు తగ్గట్లుగా సరిగ్గా ఆడలేకపోయామన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. టిమ్ డేవిడ్ చాలా చక్కగా ఆడాడని, పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్లు చాలా బాగా బంతులు వేశారన్నాడు. మైదానాల్లో తమ జట్టు రికార్డుల గురించి తాము పెద్దగా ఆలోచించమని, కేవలం మంచి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తామని రజత్ పాటిదార్ తెలిపాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఫిల్‌సాల్ట్ (37; 17 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (37నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. విరాట్ కోహ్లీ (22), రజత్ పాటిదార్ (25)లు ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్, మోహిత్ శర్మలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టగా ట్రిస్టన్ స్టబ్స్(38 నాటౌట్; 23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్లు) వేగంగా ఆడాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. యశ్ దయాల్, సుయాష్ శర్మఓ వికెట్ సాధించాడు