IPL 2025: ఆర్సీబీకి ఒకే సమయంలో ఒక గుడ్‌న్యూస్… ఒక బ్యాడ్‌న్యూస్
ఈ వారం రోజుల సమయం అతడికి గాయం నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతోంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి ఒకే సమయంలో ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్. గుడ్‌న్యూస్ ఏంటంటే.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ప్రస్తుతం వేలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. మే 3న చెన్నైతో జరిగిన మ్యాచులో అతడి వేలికి గాయం కావడంతో రెండు మ్యాచులు మిస్ అవుతాడని అందరూ భావించారు.
అయితే, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఒకవేళ మ్యాచులు జరిగి ఉంటే రజత్ పటీదార్ ఈ సమయంలో రెండు మ్యాచులు మిస్ అయ్యేవాడు. ఈ వారం రోజుల సమయం అతడికి గాయం నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతోంది. ఈ మ్యాచులు వాయిదా పడ్డాయి కాబట్టి, ఐపీఎల్ మళ్లీ ప్రారంభమయ్యాక రజత్ పటీదార్ వీటిల్లో ఆడనున్నాడు.
బ్యాడ్‌న్యూస్ ఇదే..
ఆస్ట్రేలియా స్టార్ పేసర్, ఆర్సీబీ కీలక బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశాలు లేవని సమాచారం. ఇప్పటికే అతడు భుజం గాయం కారణంగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. మే 3న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు.
జూన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉండడంతో ఆ లోపు హేజిల్‌వుడ్ ఫిట్‌గా ఉండడానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో అతడు మళ్లీ భారత్ వచ్చి ఈ ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు కనపడడం లేదు.