ధోనితో అదే గొప్ప మూమెంట్.. నేలపై కూర్చొని తినేవాళ్లం: ఉతప్ప

  • Published By: vamsi ,Published On : August 25, 2020 / 09:59 AM IST
ధోనితో అదే గొప్ప మూమెంట్.. నేలపై కూర్చొని తినేవాళ్లం: ఉతప్ప

Updated On : August 25, 2020 / 10:33 AM IST

వెటరన్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఒకే హోటల్ గదిలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ కప్ విజేతగా భారత్‌ని నిలబెట్టిన కెప్టెన్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ధోనితో కలిసి మైదానం లోపల మరియు వెలుపల గడిపిన కొన్ని గొప్ప క్షణాలు తనకు ఉన్నాయని ఉతప్ప వెల్లడించారు.



మహేంద్ర సింగ్ ధోనితో ఆడటం చాలా అద్భుతంగా ఉంటుందని, ధోని కెప్టెన్సీలో మేము గొప్ప విజయాలు సాధించామని ఉతప్ప చెప్పుకొచ్చారు. 2007 ప్రపంచ టీ20 గెలవడం మనమందరం ఎంతో ఆనందించిన క్షణం.. దేశం కోసం ప్రపంచ కప్ గెలచే రోజు ప్రతిరోజూ కుదరదు అని ఆరోజు ధోని తమకు చెప్పారని అన్నారు ఉతప్ప.

ఈ సంధర్భంగా ధోనితో తనకు ఉన్న గొప్ప అనుభవాలు గురించి పంచుకున్నారు రాబిన్ ఉతప్ప. హోటళ్లలో ధోని మరియు నేను ఇద్దరూ కలిసి గదిలో నేలపై కూర్చుని తినేవాళ్లం అని, అవి నిజంగా గొప్ప క్షణాలు మరియు మధురమైనవి అని ఉతప్ప చెప్పుకొచ్చారు.



ఇక భారత్ జట్టు పాకిస్థాన్‌పై విజయం సాధించినపుడు లీగ్‌స్టేజ్‌లో మ్యాచ్‌ ‘టై’గా మారగా.. అంపైర్లు బౌలౌట్‌ విధానంలో భారత జట్టును విజేతగా ప్రకటించారు. ఆ మ్యాచ్‌లో నేను బౌలౌట్‌కు వెళతానని అనగానే కెప్టెన్‌ ధోని ఒప్పేసుకున్నాడు. అసలు బౌలరే కాని ఒక ఆటగాడు నేరుగా కెప్టెన్‌ వద్దకెళ్లి బౌలౌట్‌ చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ, ‘ఒట్టేసి చెబుతున్నా.. ధోని కనురెప్ప కూడా వేయకుండా ఓకే అన్నాడు’ అని ఉతప్ప చెప్పుకొచ్చాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన 20 ఓవర్లలో 141/9 స్కోరు మాత్రమే భారత్ చేసింది. పాకిస్తాన్ కూడా అన్నే పరుగులు చేయగా.. చివరికి మ్యాచ్‌ టైగా మారింది. అంపైర్లు బౌలౌట్‌ విధానానికి వెళ్లారు. అప్పటికి సూపర్‌ ఓవర్‌ పద్ధతి లేదు. అప్పుడు భారత్‌ తరఫున వీరేందర్‌ సెహ్వాగ్‌, రాబిన్‌ ఉతప్ప, హర్భజన్‌ సింగ్‌ బంతులేసి వికెట్లకు తాకించారు. పాక్‌ తరఫున అరాఫత్‌, ఉమర్‌ గుల్‌, షాహిద్‌ అఫ్రిది ముగ్గురూ విఫలమయ్యారు. దాంతో భారత్‌ విజేతగా నిలిచింది.



ఉతప్ప చివరిసారిగా 2015లో జింబాబ్వేతో భారత జట్టు తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 13 వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోతున్నాడు. ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ ఐపీఎల్‌లో తన సత్తా నిరూపించుకుని మళ్లీ జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని ఉతప్ప ఎదురుచూస్తున్నాడు.