Rohan Bopanna: టెన్నిస్‌కి రోహన్ బోపన్న గుడ్ బై.. భావోద్వేగభరిత కామెంట్స్
రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఈ టెన్నిస్ స్టార్ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడు.
Rohan Bopanna: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రిటైర్‌మెంట్ ప్రకటించాడు. రెండు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన ఈ టెన్నిస్ స్టార్ ఈ సందర్భంగా భావోద్వేగభరిత కామెంట్స్ చేశాడు.
“నా జీవితానికి అర్థం ఇచ్చిన ఈ ఆటకు ఎలా వీడ్కోలు చెప్పాలి? మర్చిపోలేని రీతిలో 20 సంవత్సరాల పాటు టెన్నిస్ కెరీర్‌లో కొనసాగిన తర్వాత ఇప్పుడు నా రాకెట్‌ను అధికారికంగా పక్కన పెట్టే సమయం వచ్చింది. (Rohan Bopann)
శారీరకంగా బలపడేందుకు కూర్గ్ (కర్ణాటకలో)లో చెక్కలు కొట్టడం మొదలుకుని ప్రపంచంలోని ప్రసిద్ధ మైదానాల్లో ఆడిన అనుభవం వరకు.. ఇదంతా కలలా ఉంది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో నాకు దక్కిన అత్యున్నత గౌరవం” అని బోపన్న అన్నాడు.
తాను పోటీ ఆటల నుంచి తప్పుకుంటున్నానని, తన టెన్నిస్ ప్రయాణం ముగియలేదని బోపన్న అన్నారు. ఈ ఆట తనకు అన్నీ ఇచ్చిందని, ఇక తాను చిన్న పట్టణాల నుంచి కలలు కంటూ వచ్చే యువ క్రీడాకారుల్లో నమ్మకాన్ని కలిగించాలనుకుంటున్నానని తెలిపాడు. విశ్వాసం, కష్టపడేతత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పాడు. ఈ ఆటపై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదని తెలిపాడు. ఇది వీడ్కోలు కాదని.. తనను తీర్చిదిద్దిన, నడిపించిన, తోడైన, ప్రేమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నాడు.
రోహన్ బోపన్న 2017లో ఫ్రెంచ్ ఓపెన్‌లో గాబ్రియెలా డాబ్రోవ్‌స్కీతో జతగా ఆడి మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. 2024లో మాథ్యూ ఎబ్డెన్‌తో జతగా ఆడి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాడు.
బోపన్న పలు ఏటీపీ టైటిల్స్ గెలిచాడు. డేవిస్ కప్, ఒలింపిక్స్‌లలో కూడా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజయం సాధించిన తర్వాత, డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్ 1గా నిలిచాడు.


