రోహిత్ శర్మ జాతకాన్ని మెస్సీతో పోల్చుతూ.. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని చెప్పిన ఆస్ట్రాలజర్.. ఎలాగంటే?
అప్పటివరకే రోహిత్ విజయాన్ని సాధించగలడని ఆయన వివరించారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరిగే ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‌ను ఓడించి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కప్ కొడుతుందని ఆస్ట్రాలజర్ గ్రీన్‌స్టోన్ లోబో అన్నారు.
రోహిత్ శర్మ జాతకాన్ని ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీతో లోబో పోల్చారు. ఇద్దరూ ఒకే సంవత్సరంలో జన్మించారని, వారిద్దరికీ ఒకేరకమైన గ్రహాల వరసలు ఉన్నాయని తెలిపారు.
“రోహిత్ శర్మ జాతకం లియోనెల్ మెస్సీతో పోలి ఉంటుందని నేను ఎప్పుడూ చెబుతుంటాను. వారిద్దరూ ఒకే సంవత్సరంలో జన్మించారు. ఒకేరకమైన గ్రహాల అమరికలతో ఉన్నారు. మెస్సీ కెప్టెన్‌గా ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు.. ఎందుకంటే దీనికి ముందు, అతను తన క్లబ్ బార్సిలోనాకు కెప్టెన్‌గా పెద్ద ట్రోఫీలను గెలవలేదు.
అదే విధంగా, మెస్సీ రెండు కోపా అమెరికా టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు. దీన్ని జ్యోతిష్య శాస్త్రపరంగా విశ్లేషించినప్పుడు రోహిత్ శర్మకు కర్మిక్ కోటా ఉందని తెలుస్తోంది. అతను ఇప్పటికే టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. అతని జాతకం మరొక ఐసీసీ టోర్నమెంట్‌ను గెలుచుకునేంత శక్తిమంతమైనది.
ప్రపంచ కప్‌తో పోల్చితే, ఛాంపియన్స్ ట్రోఫీ తక్కువ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ దీనిని గెలవడానికి కూడా రోహిత్ శర్మకు గ్రహ బలం ఉంది” అని లోబో చెప్పారు.
ప్రపంచ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిందని, ఎందుకంటే రోహిత్ కర్మిక్ కోటా డిల్యూట్ అయిందని చెప్పారు. ఏ వ్యక్తి అయినా రాసిపెట్టి ఉన్నంతవరకే విజయాన్ని సాధించగలడని ఆయన వివరించారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం, రోహిత్‌కు “బలహీనమైన” ప్లూటో ఉందని, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌కు “బలమైన” ప్లూటో ఉందని ఆయన చెప్పారు. అంటే పాట్ కమ్మిన్స్‌కు రోహిత్ కంటే ఎక్కువ రాసిపెట్టి ఉందని అన్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్క్వాడ్‌ల గురించి లోబో మాట్లాడుతూ.. టీమిండియా కూర్పు కారణంగా మన జట్టు పైచేయి సాధిస్తుందని చెప్పారు.