ఎమ్మెస్ ధోనీ స్టైల్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్న రోహిత్.. ఊహించని పరిణామంతో చివరకు ఇలా..
రోహిత్ ఒక్కసారిగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

టీమిండియా మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ 2014 డిసెంబర్‌లో టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.
ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అలాగే చేయాలనుకోగా బీసీసీఐ అందుకు ఒప్పుకోలేదని స్కై స్పోర్ట్స్ తెలిపింది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. టీమిండియా కెప్టెన్‌గా ఇంగ్లండ్‌కు వెళ్లి మూడు మ్యాచులు అయిపోయాక రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలని భావించాడు.
అయితే, ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడడానికి రోహిత్ శర్మకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చినప్పటికీ, అతడిని టీమిండియా కెప్టెన్‌గా పంపడానికి మాత్రం ఒప్పుకోలేదు. తనను కెప్టెన్‌గా సెలెక్ట్ చేయకపోవడంతో రోహిత్ శర్మ ఇంగ్లండ్ పర్యటనకు ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ వివరాలను స్కై స్పోర్ట్స్ పేర్కొంది.
రోహిత్ ఒక్కసారిగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రోహిత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని రోజులకే విరాట్ కోహ్లీ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. దీంతో వారిద్దరి స్థానంలో ఏయే ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలన్న విషయం బీసీసీఐ సెలెక్టర్లకు సవాలుగా మారింది.
రోహిత్ శర్మ స్థానంలో తదుపరి టెస్ట్ కెప్టెన్‌ను ఎంపిక చేసే క్రమంలో ఇప్పటికే శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఇద్దరితోనూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ‘అనధికారిక చర్చలు’ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ మే 23న ప్రకటించే అవకాశం ఉంది.
బుమ్రా, గిల్ కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడం గురించి బీసీసీఐలోని ఒక సెలక్టర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని స్కై స్పోర్ట్స్ పేర్కొంది. గిల్ వైస్ కెప్టెన్‌గా అయితే బాగా సరిపోతాడని ఆ సెలెక్టర్ అన్నట్లు తెలుస్తోంది.