Sehwag : టీ20ల‌కు పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ప‌నికిరాడు.. సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో గ్రూప్ స్టేజీ నుంచే ఇంటి ముఖం పట్టింది

Sehwag : టీ20ల‌కు పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ప‌నికిరాడు.. సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Sehwag slams Babar Azam for his dismal show in 2024 T20 World Cup 2024

Sehwag – Babar Azam : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో గ్రూప్ స్టేజీ నుంచే ఇంటి ముఖం పట్టింది. దీంతో ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌పై ఇంటా, బ‌య‌టా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ బాబ‌ర్ ఆజాం బ్యాటింగ్‌తో పాటు అత‌డి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌పై ప‌లువురు మాజీలు మండిపడుతున్నారు. ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ సైతం చేరిపోయాడు. టీ20 ఫార్మాట్‌కు బాబ‌ర్ ఆజాం ప‌నికి రాడ‌ని సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

కెప్టెన్ మారితే టీ20ల్లో జ‌ట్టులో బాబ‌ర్ ఆజాంకు చోటు ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని సెహ్వాగ్ అభిప్రాయ ప‌డ్డాడు. ఒక‌వేళ అత‌డు వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఆడాల‌ని అనుకుంటే మాత్రం త‌న ఆట‌తీరును ఖ‌చ్చితంగా మార్చుకోవాల‌ని సూచించాడు. సిక్స్‌ల‌ను ఎక్కువ‌గా కొట్టని బ్యాట‌ర్ల‌తో అత‌డు ఒక‌డ‌ని అన్నాడు. క్రీజులో కుదురుకుని స్పిన్న‌ర్లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే సిక్స‌ర్లు కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాడ‌ని, ఫాస్ట్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొనేట‌ప్పుడు అత‌డు పాదాల‌ను క‌ద‌ల్చ‌డం తానెప్పుడు చూడ‌లేద‌న్నాడు.

Team India : క్రికెట్‌ను ప‌క్క‌న పెట్టిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. కరీబియన్ దీవుల్లో బీచ్ వాలీబాల్..

క‌వ‌ర్స్ మీదుగా బౌండ‌రీలు కొట్టాల‌నే ఆలోచ‌నే అత‌డిలో క‌నిపించ‌ద‌ని చెప్పాడు. జ‌ట్టులో త‌న స్థానాన్ని కాపాడుకునేందుకే బాబ‌ర్ ఆడ‌తాడ‌ని ఆరోపించాడు. ఈ క్ర‌మంలో అత‌డు నిదానంగా ప‌రుగులు చేస్తాడ‌ని, ఫ‌లితంగా అత‌డి స్ట్రైక్ రేటు చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌న్నాడు. ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా త‌న జ‌ట్టుకు ఏమైనా ఉప‌యోగ‌ప‌డ‌తాడా? అనే విష‌యాన్ని అత‌డు ఒక్క‌సారైనా ఆలోచించుకోవాల‌న్నాడు. తాను చెప్పే మాట‌లు కాస్త క‌ష్టంగానే ఉన్న‌ప్ప‌టికీ కూడా టీ20 ఫార్మాట్‌కు అత‌డు ప‌నికి రాడ‌న్నాడు. అత‌డి ఆట‌తీరు ఈ ఫార్మాట్‌కు స‌రిపోద‌న్నాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గ్రూపు ద‌శ‌లో అమెరికాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో సూప‌ర్ ఓవ‌ర్‌లో పాక్ ఓడిపోయింది. ఆ త‌రువాత టీమ్ఇండియా చేతిలోనూ ఓట‌మిని చ‌విచూసింది. కెన‌డాపై విజ‌యం సాధించి త‌న అదృష్టం కోసం ఎదురుచూడ‌గా.. వ‌ర్షం కార‌ణంగా అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ ర‌ద్దు కావ‌డం పాక్‌ను దెబ్బ‌కొట్టింది. గ్రూప్ ఏ నుంచి భార‌త్‌తో పాటు అమెరికా సూప‌ర్ 8కి చేరుకోగా పాకిస్తాన్ ఇంటి ముఖం ప‌ట్టింది.

Sandeep Lamichhane : అత్యాచార ఆరోప‌ణ‌లు.. క‌ట్ చేస్తే.. టీ20 ఫార్మాట్‌లోనే అరుదైన ఘ‌న‌త‌..