Smriti Mandhana : కొద్దిలో ప్రమాదం తప్పింది.. ఒకవేళ అలా జరిగి ఉంటేనా.. నా గతి ఏమయ్యేదో.. స్మృతి మంధాన
ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) మాట్లాడుతూ గ్రేస్ హారిస్ పై ప్రశంసల వర్షం కురిపించింది.
Smriti Mandhana comments after RCB won by 9 wickets against UP Warriorz (pic credit@RCBTweets
- డబ్ల్యూపీఎల్‌లో ఆర్‌సీబీ జోరు
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం
- గ్రేస్ హారిస్ పై మంధాన ప్రశంసల జల్లు
Smriti Mandhana : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకెళుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం యూపీ వారియర్జ్ జట్టు పై 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో యూపీ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో దీప్తి శర్మ (45 నాటౌట్; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (40; 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 12.1 ఓవర్లలో వికెట్ కోల్పోయి అందుకుంది. గ్రేస్ హారిస్ (85; 40 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు), స్మృతి మంధాన (47 నాటౌట్; 32 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు.
మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. గ్రేస్ హారిస్ పై ప్రశంసల వర్షం కురిపించింది. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండి ఆమె విధ్వంసాలను ప్రత్యక్షంగా చూడడం బాగుందని చెప్పింది. ఆమె మా జట్టులో ఉండబట్టి సరిపోయింది గానీ, ప్రత్యర్థి టీమ్‌లో ఉంటే.. ఆమెని ఎలా ఆపాలో తెలియక ఓ కెప్టెన్‌గా తన పరిస్థితి ఏంటో తెలియదని అంది. సింగిల్ తీసి ఆమెకు ఇస్తే చాలు తను బౌండరీలతో రెచ్చిపోతుందని చెప్పుకొచ్చింది. ఒకరితో ఆమెను పోల్చడం సరిదకాని, ఫెఫాలీ వర్మ అయినా, గ్రేస్ అయినా ఆడుతున్నప్పుడు వారికి సింగిల్ తీసి ఇవ్వడమే తన పని అని చెప్పుకొచ్చింది.
ఎన్ని మొక్కలు ఇంటికి తీసుకువెళుతుందో..
ఇక తమ బౌలర్లు అందరూ చక్కగా బౌలింగ్ చేశారని అంది. ముఖ్యంగా లారెన్ బెల్ డాట్ బాల్స్‌తో ప్రత్యర్థిని కట్టడి చేస్తుందని తెలిపింది. ఆమె వేసే డాట్ బాల్స్ చూసి.. సీజన్ ముగిసే వరకు ఎన్ని మొక్కలు ఇంటికి పట్టుకెళ్లుతావని సరదాగా ఆట పట్టిస్తున్నానని తెలిపింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఆమె బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. బంటిని బ్యాటర్లు టచ్ కూడా చేయలేకపోతున్నారంది.
ఇక ఆర్‌సీబీ జట్టులో తాను నేర్చుకున్న విషయం ఏంటంటే.. ముందే ఎక్కువగా ఊహించి మాట్లాడకూడదు. గత మూడు నుంచి నాలుగేళ్లలో ఇప్పుడున్న జట్టే అత్యంత కష్టపడే తత్వం ఉన్న జట్టు అని చెప్పింది. ట్రోఫీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామని అంది.
