రోహిత్ శర్మలో అద్భుతమైన నాయకుడిని చూశాను.. ఆరోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన అశ్విన్

నా తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసిన రోజు రోహిత్, ద్రవిడ్ నా గదికి వచ్చారు. ఆలోచించడం మానేసి మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లు అంటూ రోహిత్ సూచించగా..

రోహిత్ శర్మలో అద్భుతమైన నాయకుడిని చూశాను.. ఆరోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయిన అశ్విన్

Ravichandran Ashwin

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని హృదయం స్వచ్ఛమైనదని పేర్కొన్నాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అశ్విన్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ గొప్పతనం గురించి వివరించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఇటీవల ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 4-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సిరీస్ లోని మూడో టెస్టు మ్యాచ్ లో రెండోరోజు స్టార్ స్పిన్నర్ అశ్విన్ తన తల్లి అనారోగ్యం కారణంగా వెంటనే ఇంటికి ప్రయాణం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో జరిగిన ఘటనను అశ్విన్ వెల్లడించాడు.

Also Read : Rishabh Pant : శుభ‌వార్త‌.. ఐపీఎల్ 2024 ఆడేందుకు రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ ప్రకట‌న‌

తన తల్లి అనారోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న వెంటనే అశ్విన్ ఇంటికి వెళ్లాలనుకున్నాడు. తన తల్లి ఎలా ఉంది, అపస్మారక స్థితిలో ఉందా? అని వైద్యుడిని అశ్విన్ ప్రశ్నించాడు. చూసే స్థితిలో లేదని సమాధానం రావడంతో కన్నీళ్లు పెట్టుకున్నానని అశ్విన్ తెలిపాడు. తాను రాజ్ కోట్ నుంచి చెన్నై వెళ్లే విమానాలకోసం వెతకడం ప్రారంభించాను.. అయితే, రాజ్ కోట్ విమానాశ్రయం సాయంత్రం 6గంటలకు మూసివేయబడుతుంది.  అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. రూంలో కూర్చొని ఏడుస్తున్నాను.. అదే సమయంలో రోహిత్, ద్రవిడ్ తన గదికి వచ్చారు. ఆలోచించడం మానేసి మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లు అంటూ రోహిత్ సూచించగా.. వెళ్లడానికి ఆ సమయంలో రాజ్ కోట్ నుంచి విమానం లేదని నేను చెప్పాను. ఆ సమయంలో రోహిత్ శర్మ చార్టర్ విమానం బుక్ చేసేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడని అశ్విన్ అన్నారు. అంతేకాదు.. టీమ్ ఫిజియో కమలేష్ ను నాతోపాటు చెన్నైకి వెళ్లమని రోహిత్ సూచించాడు. నేను వద్దని చెప్పాను. కానీ, నేను విమానాశ్రయానికి వెళ్లేసరికి కమలేష్ తన బ్యాగ్ తో రెడీగా ఉన్నాడు. పుజారాకూడా వచ్చాడు. మేము ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి 9.30గంటలకు కమలేశ్ కు రోహిత్ ఫోన్ చేసి నా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అంటూ అశ్విన్ పేర్కొన్నాడు.

Also Read : Hardik Pandya : ప్లేయ‌ర్‌గా వెళ్లాడు.. కెప్టెన్‌గా తిరిగొచ్చాడు.. ముంబై డ్రెస్సింగ్ రూమ్‌లో పాండ్య రీ ఎంట్రీ అదుర్స్‌..

ఆ రోజు క్లిష్ట సమయంలో రోహిత్ శర్మ నాకు అండగా నిలిచాడు. ఒకవేళ నేను కెప్టెన్ గా ఉంటే నా ఆటగాడిని ఇంటికి వెళ్లమని అడుగుతాను, కానీ, అతనిని చూసుకోవడానికి రోహిత్ శర్మలా నేను ప్రయత్నిస్తానా? తెలియదు. ఆ రోజు రోహిత్ శర్మ లో ఒక అద్భుతమైన నాయకుడిని చూశాను. నేను చాలా మంది కెప్టెన్ల కింద ఆడాను. కానీ, రోహిత్ లో ఏదో తేడా ఉందని అశ్విన్ చెప్పాడు. రోహిత్ హృదయం స్వచ్ఛమైనది. ధోనీతో సమానంగా ఐదు ఐపీఎల్ ట్రోపీలను రోహిత్ గెలుచుకున్నాడు. ఇది సులభం కాదు. ధోనీకూడా సహాయం చేస్తాడు. కానీ, రోహిత్ మరో అడుగు ముందుకేశాడు అంటూ అశ్విన్ అన్నాడు.