Stuart Broad : స్టువర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత.. ఆసీస్ పై ఈ రికార్డు అందుకున్న ఒకే ఒక్కడు
ఇంగ్లాండ్ పేస్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad ) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ (Ashes)సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లాండ్ బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు

Stuart Broad
Stuart Broad 150 Ashes wickets : ఇంగ్లాండ్ పేస్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad ) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. యాషెస్ (Ashes)సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లాండ్ బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. లండన్‌లోని ఓవల్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో బ్రాడ్ ఈ ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా(47) ను ఎల్భీగా ఔట్ చేయడంతో బ్రాడ్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
మరికొద్దిసేపటికే ట్రావిస్ హెడ్(4)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. ఇప్పటి వరకు బ్రాడ్ ప్రస్తుతం జరుగుతున్న టెస్టుతో కలిపి 40 యాషెస్ మ్యాచ్‌లు ఆడాడు. 28.81 సగటుతో 151 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 8/15. అతను తన యాషెస్ కెరీర్‌లో ఆరు నాలుగు వికెట్లు, ఎనిమిది ఐదు వికెట్లు ప్రదర్శనను నమోదు చేశాడు.
యాషెస్ సిరీస్‌లో రెండు జట్లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో బ్రాడ్ మూడో స్థానంలో నిలిచాడు. దివంగత ఆసీస్ స్పిన్ గ్రేట్ షేన్ వార్న్ 195 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ 157 వికెట్లతో ఆ తరువాతి స్థానంలో ఉన్నాడు.
2023 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్ 27.25 సగటుతో ఇప్పటి వరకు 20 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/65. అతను ఈ సిరీస్‌లో ఓసారి ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా బ్రాడ్ 167 టెస్టుల్లో 27.63 సగటుతో 602 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 8/15. అతను టెస్ట్ క్రికెట్‌లో 20 ఐదు వికెట్లు, మూడు సార్లు పది వికెట్లు ప్రదర్శన చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (40), పాట్ కమిన్స్ (1) లు క్రీజులో ఉన్నారు.