ICC Board Meeting : T20 World Cup జరుగుతుందా ? లేదా ?

  • Publish Date - July 20, 2020 / 12:04 PM IST

కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్టే… క్రికెట్‌పైనా పడింది. దీంతో ఆటకు విరామం ఏర్పడింది. కరోనా నేపథ్యంలో పలు దేశాల టోర్నీలు వాయిదా పడ్డాయి. చివరికి T-20 World Cup నిర్వహణపైనా కరోనా ప్రభావం చూపుతోంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది జరుగుతుందా… లేకా వాయిదా పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఆసీస్‌లో World Cup Event జరగాలి. కానీ ఇంత వరకు ICC మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులంతా టీ20 ప్రపంచకప్‌పై ICC ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించలేమని ఆతిథ్య ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. అయినా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మాత్రం ఆ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే 2020, JULY 20వ తేదీ సోమవారం జరిగే.. వర్చువల్‌ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం ఉందని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు T-20 World Cup కోసం BCCI కూడా ఎదురు చూస్తోంది. పొట్టి ప్రపంచకప్‌ను త్వరగా నిర్వహించాలని BCCI  కోరుతోంది. సమావేశంలో T-20 World Cup‌ను ICC ఒకవేళ వాయిదా వేస్తే.. అదే సమయంలో IPL  నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

ఇప్పుడీ సమయంలో IPL‌ను నిర్వహించేందుకు బోర్డు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికను కూడా సిద్ధం చేసుకుంది. కుదించైనా సరే లీగ్‌ను ముగించాలనే పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని బోర్డు అధ్యక్షుడు గంగూలీ స్పష్టంగా చెప్పాడు కూడా! ఈసారి ఐపీఎల్‌ విదేశాల్లోనే జరుగుతుందని దాదా ఇదివరకే స్పష్టతనిచ్చాడు.

ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి ఆసియా కప్‌ రద్దు ప్రకటనను ఇప్పించాడు. ఇవన్నీ కూడా ఐపీఎల్‌ తంతు కోసమే. ఈసారి లీగ్‌ జరగకపోతే బోర్డుకు 4000 కోట్ల నష్టం వస్తుంది.

మరోవైపు Monday జరిగే ICC BOARD సమావేశంలో.. తదుపరి చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ అంశం కూడా చర్చకు రానుంది. చైర్మన్‌ పదవి నుంచి ఈ నెల మొదట్లో శశాంక్‌ మనోహర్‌ తప్పుకొన్నారు. ఈసారి చైర్మన్‌ పీటం కోసం ఎక్కువ మంది రేసులో ఉండడంతో ఎన్నిక ప్రక్రియపై బోర్డు ఓ నిర్ణయానికి రానుంది.

ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చీఫ్‌ కోలిన్‌ గ్రేవ్స్‌.. ఐసీసీ చైర్మన్‌ పదవికి ప్రధాన పోటీదారుగా ఉండగా… బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పేరు కూడా వినిపిస్తున్నది. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ గ్రెగోర్‌ బార్క్‌లే, ప్రస్తుతం తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్‌ ఖవాజా కూడా పోటీలో ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.