Afghan Cricket: అఫ్ఘాన్ క్రికెట్‌కు తాలిబాన్ సపోర్ట్.. వచ్చే నెలలో పాకిస్తాన్‌తో వన్డే సిరీస్!
అఫ్ఘానిస్తాన్ మరియు పాకిస్తాన్ శ్రీలంకలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 వన్డేలు ఆడాల్సి ఉంది.

Taliban (1)
Afghanistan cricket: అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ తరువాత, ఆ దేశ క్రికెట్ జట్టు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అయితే, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో పాకిస్థాన్‌తో వన్డే సిరీస్, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సిరీస్ కోసం, అఫ్ఘానిస్తాన్ ఆటగాళ్ళు రోడ్డు మార్గంలో పాకిస్తాన్ వెళ్తారు. అక్కడి నుంచి జట్టు యూఏఈ ద్వారా శ్రీలంక చేరుకుంటుంది.
పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగం. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. “ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఆటగాళ్లందరూ వీసాలు పొందుతారు. రెండు దేశాల మధ్య అత్యంత రద్దీగా ఉండే పోర్ట్ తుర్కామ్ సరిహద్దు గుండా పాకిస్తాన్‌లోకి ప్రవేశిస్తారు” అని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
అఫ్ఘానిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌ని పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌తో కలిపే సరిహద్దు తుర్ఖామ్.. కాబూల్ నుంచి తుర్కామ్ సరిహద్దు మీదుగా పెషావర్ వెళ్లే డ్రైవ్ మూడున్నర గంటలు. ఈ బృందం పెషావర్ నుంచి ఇస్లామాబాద్ మరియు అక్కడ నుంచి యూఏఈకి వెళ్తుంది. దీని తరువాత, అఫ్ఘానిస్తాన్ జట్టు యూఏఈ నుంచి కొలంబోకు వెళ్తుంది.
ఇదిలా ఉంటే, అఫ్ఘాన్ జాతీయ క్రికెటర్లను కలిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు మద్దతు ఇస్తామని తాలిబాన్లు ప్రకటించారు. తాలిబాన్ ప్రతినిధులు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మరియు నిర్వాహకులతో సమావేశమైన తర్వాత, సీనియర్ జాతీయ క్రికెట్ జట్టు సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. గతంలో కూడా క్రికెట్‌కు, క్రీడలు ఆడేందుకు సపోర్ట్ చేస్తామని, అందకు మద్దతు ఇస్తామని తాలిబాన్లు చెబుతున్నారు.
జాతీయ క్రికెట్ జట్టు సభ్యులతో జరిగిన సమావేశంలో తాలిబాన్ పొలిటికల్ ఆఫీస్ మెంబర్ అనస్ హక్కానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది, క్రికెట్ బోర్డు ఎంపిక కమిటీ మాజీ చైర్మన్ అసదుల్లా మరియు నూర్ అలీ జద్రాన్ పాల్గొన్నారు. సమావేశంలో, హక్కానీ క్రికెట్ రంగానికి భరోసా ఇచ్చారు. అంతేకాదు.. క్రికెటర్ల సమస్యలను కూడా వెంటనే అంచనా వేస్తామన్నారు.
అఫ్ఘానిస్తాన్ మరియు పాకిస్తాన్ శ్రీలంకలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 వన్డేలు ఆడాల్సి ఉంది.