పూణేలో జరుగుతోన్న టెస్టులో టీమిండియా పూర్తిగా పట్టు బిగించేసింది. భారీ పరుగులతో ఫస్ట్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా..అచ్చంగా మొదటి టెస్టులో ఏం జరిగిందో రెండో టెస్టులోనూ అలానే సఫారీలు మూడు వికెట్లు సమర్పించేసుకున్నారు. 273 పరుగుల వద్ద టీమిండియా శుక్రవారం ఇన్నింగ్స్‌ని కొనసాగించగా..కెప్టెన్ కోహ్లీ విజృంభణతో పటిష్టమైన స్కోరు సాధించింది. రహానే ఆఫ్ సెంచరీ తర్వాత ఔటవగా..తర్వాత వచ్చిన రవీంద్రజడేజా కోహ్లీకి ఫుల్ సపోర్టిచ్చేశాడు. దీంతో కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు.
జడేజా కూడా పరుగుల వరద పారించాడు..ఈ క్రమంలోనే కోహ్లీ తన అత్యధిక స్కోరు 243ను దాటేశాడు. 295 బంతుల్లో 28 ఫోర్ల సాయంతో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 7వ డబుల్ సెంచరీ. టెస్టుల్లో టీమిండియా తరుపున 7 డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. వెస్టిండిస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలపై ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డులెక్కాడు.
ఈ రెండువందల పరుగులతోనే 7000 పరుగుల మైలురాయిని కోహ్లీ అధిగమించాడు. కోహ్లీకి ముందున్న వీరేంద్రసెహ్వాగ్ 104 టెస్టులలో, సచిన్ 200 టెస్టులలో 6 డబుల్ సెంచరీలు చేయగా..కోహ్లీ మాత్రం 81 టెస్టులలోనే 7 డబుల్ సెంచరీలు చేయడం అతని స్పీడ్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
కోహ్లీకి రెండో ఎండ్‌లో మంచి సపోర్ట్ ఇచ్చిన జడేజా 91 పరుగుల దగ్గర ఔటయ్యాడు. కోహ్లీ 601/5 స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు. తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలకు టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ షాక్ ఇచ్చాడు ఓపెనర్లద్దరినీ సింగిల్ డిజిట్‌కే ఔట్ చేశాడు.
తంబా బువ్మాని షమీ ఔట్ చేయడంతో 15ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సౌతాఫ్రికా. దీంతో మూడో రోజు ఆట రిజల్ట్‌ని డిసైడ్ చేయడం ఖాయంగా కన్పిస్తోంది.
Read More : డబుల్ సెంచరీల్లోనూ కోహ్లీనే నెం.1