ధోనిపై ప్రశంసల వర్షం.. ట్రెండింగ్‌లో #ThankYouMahi, #ThankYouDhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి శాశ్వతంగా వీడ్కోలు పలకడం ఫ్యాన్స్ కి కాస్త కష్టంగానే ఉంది. దాదాపు 16 ఏళ్లు భారత జట్టుకు మహీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ధోని అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి గొప్ప విజయాలు అందించాడు. గతేడాది టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత ధోనీ ఎప్పుడు తప్పుకుంటాడనే ప్రశ్నలు వినిపించాయి. తాజాగా ఎవరి ఊహకు అందని రీతిలో సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటన చేశాడు ధోని.
ధోని అంతర్జాతీయ క్రికెట్ కు అనూహ్యంగా గుడ్ బై చెప్పడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరికొన్నాళ్లు కొనసాగాలని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కొందరు వేడుకుంటున్నారు. భారత క్రికెట్‌లో ఓ శకం ముగిసిందని, ధోని టీమిండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చాడని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతని సేవలకు గాను అభిమానులు, సహచర ఆటగాళ్లు #ThankYouMahi, #ThankYouDhoni అనే హ్యాష్‌టాగ్‌తో అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో ఈ హ్యాష్‌టాగ్‌లు ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయి. అయితే, ధోనితో పాటే సురేష్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం బాధగా ఉందని కొందరు ఫ్యాన్స్ వాపోయారు.
కట్టకట్టుకుని ధోని, రైనా ఒకేసారి ఆటకు స్వస్తి చెప్పడంతో గుండె పగిలినట్టయిందని బీజేపీ యువజన మోర్చాకు చెందిన శివలిక అంబానీ వాపోయారు. వారిద్దరు గొప్ప గొప్ప భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిడింయాను విజయతీరాలకు చేర్చానని గుర్తు చేశారు. ధోని లాంటి కెప్టెన్ టీమిండియాకు ఎప్పటికీ దొరకడని మరో అభిమాని అన్నాడు. ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నువ్ హీరోనే అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆట నుంచి రిటైర్ అయినా మా గుండెల్లో చిరకాలం ఉంటావని ఇంకో అభిమాని ప్రేమని చాటుకున్నారు. 33 ఏళ్ల రైనా కూడా ఆటకు గుడ్‌బై చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, భారత క్రికెట్‌కు ఇదొక దుర్దినమని మరో క్రికెట్ ప్రేమికుడు వాపోయాడు. 16 ఏళ్ల మీ సేవలను ప్రణమిల్లుతున్నామని ఓ అభిమాని కృతజ్ఞతలు తెలిపాడు.
ఎన్ని ఘనతలు పొందినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఓ రోజు చేస్తున్న పనికి శాశ్వత విరామం ప్రకటించాల్సిందే కదా. అభిమానులకు కొంత నిరాశ తప్పదు. ఇదే దశను సచిన్, క్లైవ్‌లాయిడ్, మారడోనా పీలే, మార్టినా నవత్రిలోవా తదితర క్రీడాకారులకూ తప్పలేదు. ఇప్పుడు ధోనీకీ తప్పలేదు. ఆటగాడిగా, సారథిగా మిస్టర్ కూల్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు.