Champions Trophy: అందుకే పాకిస్థాన్ ఓడిపోయింది: కుండబద్దలు కొట్టేసిన పాక్ మాజీ క్రికెటర్
పాక్ సెమీస్ వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుందని క్రీడా విశ్లేషకులు కూడా అంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో ఆదివారం జరిగిన మ్యాచులో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో పాక్ పూర్తి నిరాశలో కూరుకుపోయింది. పాక్ ఎంతటి నిరాశలో ఉందో ఒకే ఒక్క మాటలో చెప్పారు ఆ దేశ మాజీ క్రికెటర్, మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్.
విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడడంతో పాకిస్థాన్ 45 బంతులు మిగిలి ఉండగానే, 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ ఓ ఇంటర్వ్యూలో అహ్మద్ షెజాద్ పాకిస్థాన్ జట్టు గురించి స్పందిస్తూ.. ఆటగాళ్ల ఎంపికలో ఫేవరిటిజం ఏమీ లేదని అంటారని, అటువంటి సిస్టమే లేదని కొందరు చెబుతారని అన్నారు.
కానీ, ఫేవరిటిజం ఉందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీన్ని మనం చూశామని, తమకు అన్నీ తెలుసని చెప్పారు. పాకిస్థాన్ క్రికెటర్ల సెలెక్షన్ విషయంలో సరైన మార్గంలో వెళ్లకపోతే ప్రపంచానికి నిజం చెబుతామని అన్నారు. పాకిస్థాన్‌లో మిగిలి ఉన్న ఒకే ఒక్క ఆట క్రికెట్ అని, ఇప్పుడు అది కూడా ఫినిష్ అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, మొహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. న్యూజిలాండ్ 321 పరుగులు చేయగా, పాకిస్థాన్ కేవలం 260 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 60 పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది.
ఇప్పుడు భారత్‌లో జరిగిన మ్యాచులోనూ పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చి 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమైంది. దీంతో పాకిస్థాన్ ఫ్యాన్స్ పూర్తి నిరాశతో ఉన్నారు.
పాకిస్థాన్ సెమీస్ వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుందని క్రీడా విశ్లేషకులు కూడా అంటున్నారు. సొంత దేశంలో ట్రోఫీ జరుగుతున్న సమయంలోనూ పాక్ రాణించకపోతుండడం గమనార్హం.