టీమిండియాతో జరిగిన మ్యాచులో అమెరికాకు 5 పరుగుల కోత ఎందుకు విధించారో తెలుసా?

టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది మరింత కలిసి వచ్చింది.

టీమిండియాతో జరిగిన మ్యాచులో అమెరికాకు 5 పరుగుల కోత ఎందుకు విధించారో తెలుసా?

Pic Credit: @ICC twitter

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో అమెరికాపై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ – A నుంచి సూపర్ -8లోకి భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రవేశించింది. ఈ మ్యాచులో అసలే ఒత్తిడిలో ఉన్న అమెరికాకు 5 పరుగుల పెనాల్టీ పడడంతో ఆ దేశ ఆటగాళ్లపై మరింత ఒత్తిడి పెంచింది.

బౌలింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌లో అమెరికా మూడుసార్లు ఓవర్‌కి ఓవర్‌కి మధ్య 60 సెకన్ల కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఓవర్ల మధ్య నిమిషానికి మించి సమయం తీసుకోకూడదు. దీంతో అమెరికాకు 5 పరుగుల పెనాల్టీ పడింది. ఇటువంటి పెనాల్టీ విధించడం ఇదే మొట్టమొదటిసారి.

టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది మరింత కలిసి వచ్చింది. పీల్డింగ్ లో వైఫల్యం వల్ల అమెరికా మూల్యాన్ని చెల్లించుకుంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 16వ ఓవర్ ప్రారంభంలో లక్ష్య ఛేదనకు 35 పరుగులు అవసరం. ఆ సమయంలో అమెరికాపై పడిన పెనాల్టీ తర్వాత అది 30 పరుగులకు తగ్గింది.

దీంతో 30 బంతుల్లో 30 పరుగులు మాత్రమే బాదాల్సి ఉందని ప్రకటించారు. చివరకు భారత్ మరో పది బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచులో 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. సూర్య కుమార్ 50 పరుగులు, శివమ్ దూబె 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి టీమిండియాను గెలిపించారు.

Also Read: వ‌రుణుడిని వేడుకుంటున్న పాకిస్తాన్ ఆట‌గాళ్లు.. సాయం చేసేనా..?