సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై హెచ్‌సీఏ ఒత్తిడి తెచ్చి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది: విజిలెన్స్ నివేదిక
లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేశారు. హెచ్‌సీఏపై చర్యలకు విజెలెన్స్ సిఫారసు చేసింది.

ఐపీఎల్ 2025 జరుగుతోన్న వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య వివాదం రాజుకున్న విషయం విదితమే. ఐపీఎల్ టికెట్లు, పాస్‌ల విషయంలో హెచ్‌సీఏ తమను వేధిస్తోందని కొన్ని వారాల క్రితం ఎస్‌ఆర్‌హెచ్ ఆరోపణలు చేసింది.
ఫ్రీ టికెట్ల విషయంలో హెచ్‌సీఏ నుంచి బెదింపులను ఎదుర్కొంటున్నామని హెచ్‌సీఏ కోశాధికారికి అప్పట్లో సన్‌రైజర్స్ ప్రతినిధి లేఖ రాశారు. ఈ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. హెచ్‌సీఏపై వస్తున్న ఆరోపణలపై విచారణకు విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు ఇవాళ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను పంపారు. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీపై హెచ్‌సీఏ సెక్రటరీ ఒత్తిడి తీసుకొచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. టికెట్ల కోసం ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపారు.
పది శాతం టికెట్లను హెచ్‌ఆర్‌ఎస్ యాజమాన్యం ఫ్రీగా ఇస్తుండగా, మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై హెచ్‌సీఏ సెక్రటరీ ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. ఫ్రీగా 10 శాతం టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యం తేల్చి చెప్పింది. ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ డిమాండ్ చేశారు.
హెచ్‌సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంటామని ఎస్‌ఆర్‌హెచ్ తెలిపింది. తనకు వ్యక్తిగతంగా 10 శాతం టికెట్లు కావాలని జగన్మోహన్ డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఎస్‌ఆర్‌హెచ్ తేల్చి చెప్పింది. దీంతో మ్యాచ్‌ల వేళ ఎస్‌ఆర్‌హెచ్‌ను జగన్మోహన్ ఇబ్బందులకు గురిచేశారు. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేశారు. హెచ్‌సీఏపై చర్యలకు విజెలెన్స్ సిఫారసు చేసింది.