Virat Kohli : విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రతో ఢిల్లీ మ్యాచ్.. అరుదైన రికార్డు పై కోహ్లీ కన్ను.. ఒక్క పరుగు చేస్తే..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) పదిహేళ్ల తరువాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు.
Virat Kohli has 15999 List A runs so far need one run get to 16K runs
Virat Kohli : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పదిహేళ్ల తరువాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. బుధవారం నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ, ఆంధ్ర జట్లు తలపడ్డనున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (Virat Kohli) తన సొంత జట్టు ఢిల్లీ తరుపున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్.
అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో ఇప్పటి వరకు కోహ్లీ 308 మ్యాచ్‌ల్లో 14557 పరుగులు సాధించాడు. ఇక వీటిని కలుపుకుని లిస్ట్ ఏ క్రికెట్‌లో (అంతర్జాతీయ వన్డేలతో పాటు విజయ్ హజారే ట్రోఫీ, భారత్-ఎ, జోనల్ జట్ల తరఫున సాధించిన పరుగులు) కోహ్లీ చేసిన పరుగులు 15,999కి చేరాయి. ఆంధ్రతో మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క పరుగు చేస్తే.. లిస్ట్ ఏ క్రికెట్‌లో 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కుతాడు.
ఈ జాబితాలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కన్నా ముందు ఈ ఘనత సాధించాడు. సచిన్ లిస్ట్ ఏ క్రికెట్‌లో 21,999 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు గ్రాహమ్ గూచ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 22,211 పరుగులు సాధించాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు వీరే..
* సచిన్ టెండుల్కర్ – 538 ఇన్నింగ్స్‌లో 21,999 పరుగులు
* విరాట్ కోహ్లి – 329 ఇన్నింగ్స్‌లో 15,999 పరుగులు
* సౌరవ్ గంగూలీ – 421 ఇన్నింగ్స్‌లో 15,622 పరుగులు
* రోహిత్ శర్మ- 338 ఇన్నింగ్స్‌లో 13,758 పరుగులు
* శిఖర్ ధావన్ – 298 ఇన్నింగ్స్‌లో 12,074 పరుగులు
ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* గ్రాహమ్ గూచ్ – 22,211 పరుగులు
* గ్రీమ్ హిక్ – 22,059 పరుగులు
* సచిన్ టెండూల్కర్ – 21,999 పరుగులు
* కుమార సంగక్కర – 19,456 పరుగులు
* వివ్ రిచర్డ్స్ – 16,995 పరుగులు
