Gede Priandana : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అద్భుతం.. ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన ఇండోనేషియా బౌలర్..
అంతర్జాతీయ టీ20ల్లో ఇండోనేషియాకు చెందిన ప్రియాందన (Gede Priandana) ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు.
Gede Priandana becomes first to pick five wickets in an over in T20Is
Gede Priandana : అంతర్జాతీయ టీ20ల్లో ఓ అద్భుతం నమోదైంది. ఓ బౌలర్ ఒకే ఓవర్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు. ఇండోనేషియాకు చెందిన గేడే ప్రియాందన ఈ ఘనత సాధించాడు.
మంగళవారం బాలీ వేదికగా ఇండోనేషియా, కంబోడియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇండోనేషియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రియాందన తన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ పురుష, మహిళల క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో అతడు లంక పేసర్ లసిత్ మలింగను అధిగమించాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మలింగ ఒక ఓవర్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇండోనేషియా బ్యాటర్లలో ధర్మ కేశుమ (110; 68 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. అనంతరం 168 పరుగుల లక్ష్య ఛేదనలో కంబోడియా 15 ఓవర్లకు 106/5 స్కోరుతో ఉంది.
ఈ సమయంలో 16వ ఓవర్‌ను మీడియం పేసర్ అయిన ప్రియాందన వేశాడు. ఈ మ్యాచ్‌లో అతడికి ఇదే తొలి ఓవర్. మొదటి మూడు బంతుల్లో వరుసగా షా అబ్రార్ హుస్సేన్, నర్మల్జిత్ సింగ్, చాంతోయున్ రథనక్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఇక ఐదు, ఆరు బంతుల్లో మాంగ్దారా సోక్, పెల్ వెన్నక్‌లను ఔట్ చేసి ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఏడుగురు కంబోడియా బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం.
Pat Cummins : టీ20 ప్రపంచకప్ 2026లో పాట్ కమిన్స్ ఆడటం అనుమానమే!
ప్రియాందన ఈ ఘనత సాధించడానికి ముందు, పురుషుల దేశవాళీ T20 క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు రెండుసార్లు మాత్రమే నమోదయ్యాయి. 2013-14లో విక్టరీ డే T20 కప్‌లో UCB-BCB XI తరపున అల్-అమీన్ హుస్సేన్ ఈ ఘనత సాధించగా, 2019-20లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో కర్ణాటక తరపున అభిమన్యు మిథున్ ఈ ఘనత సాధించాడు.
