Virat Kohli : ప్రపంచ రికార్డుపై కోహ్లీ కన్ను.. వన్డేల్లో మరో 96 పరుగులు చేస్తే..
వన్డేల విషయానికి వస్తే విరాట్ కోహ్లీకి మించిన మ్యాచ్ విన్నర్ మరొకరు లేరు.

Virat Kohli Needs 96 Runs In ICC Champions Trophy 2025 To Become First Player
Virat Kohli ODI Records: ఇటీవల టెస్టుల్లో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ గొప్పగా లేదు. అయినప్పటికి వన్డేల విషయానికి వస్తే అతడికి మించిన మ్యాచ్ విన్నర్ మరొకరు లేరు. పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆశలన్ని అతడి పైనే ఉన్నాయి. ఎంఎస్ ధోని సారథ్యంలో 2013లో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తరువాత మరోసారి ఈ టోర్నీలో విజేతగా నిలవలేదు.
స్వదేశంలో 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా ఫైనల్ కు చేరింది. అయితే.. ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా పై ఓడిపోయింది. వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ అదరగొట్టాడు. 11 మ్యాచుల్లో 765 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అరుదైన రికార్డుకు అతి చేరువలో..
ఇదిలా ఉంటే.. కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లీకి మరో 96 పరుగులు అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ ఈ రికార్డును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Chahal-Dhanashree : విడాకుల వార్తలు.. ఎట్టకేలకు మౌనం వీడిన చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ..!
వన్డే క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కరలు మాత్రమే 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. సచిన్ 350 ఇన్నింగ్స్‌ల్లో, సంగక్కర 378 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. వన్డేల్లో కోహ్లీ ఇప్పటి వరకు 295 మ్యాచుల్లో 13906 పరుగులు చేశాడు.
మరో 329 పరుగులు చేస్తే..
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్ 18426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత 14234 పరుగులతో కుమార సంగక్కర రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ 13906 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డేల్లో కోహ్లీ మరో 329 పరుగులు చేస్తే సంగక్కరను దాటి రెండో స్థానానికి చేరుకుంటాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డేకు నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న, అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 12న మూడో వన్డే మ్యాచ్ జరగనుంది.