ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తూ.. కోహ్లీ ఓటు వేయలేకపోయాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తన భార్యతో కలిసి ముంబైలోని ఓర్లీ ప్రాంతంలో ఓటేయాలని కోహ్లీ మొదట భావించాడు. అందుకోసం ఎలక్షన్ కమిషన్‌కు ఓటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాడు. కానీ కోహ్లీ అప్లికేషన్ గడువు తర్వాత రావడంతో అతనికి ఓటు హక్కు లభించలేదు. దీంతో కోహ్లీ ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే తాజాగా ‘నేను ఓటు వేస్తున్నా మీరు’ అంటూ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రమ్ ద్వారా ఓటర్ ఐడీ కార్డు ఫొటోను పోస్ట్ చేశాడు. ‘ మే 12న గురుగ్రామ్‌లో నేను ఓటేస్తున్నా. మరి మీరు? ’ అంటూ పోస్ట్ చేయగా ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 12న జరగబోతుంది. అయితే బెంగళూరు ఆడిన 12మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే దక్కించుకుని జట్టు చివరి స్థానంలో ఉంది. మిగిలిన 2మ్యాచ్‌ల్లో గెలిచినా కూడా జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు లేవు.
ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా లేకపోవడంతో కోహ్లీ దరఖాస్తు చేసుకోగా అతనికి గుర్‌గ్రామ్ నుంచి ఓటు వేసుకునే అవకాశం లభించింది. మే 12న హరియాణా, ఢిల్లీతో పాటు బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. మే 12న ఆరో విడత ఎన్నికలు జరగనున్నాయి.