IPL jerseys : బీసీసీఐ ఆఫీసులో భారీ దొంగతనం.. 6.5లక్షల విలువ చేసే 261 ఐపీఎల్ జెర్సీలను ఎత్తుకెళ్లిన సెక్యూరిటీ గార్డు..
బీసీసీఐ స్టోర్ రూమ్ నుంచి 261 అధికారిక ఐపీఎల్ జెర్సీలను సెక్యూరిటీ గార్డు దొంగిలించాడు.

Wankhede stadium heist 261 IPL jerseys stolen from BCCI office
వాంఖడే స్టేడియంలోని రెండో అంతస్తులో ఉన్న బీసీసీఐ స్టోర్ రూమ్ నుంచి 261 అధికారిక ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) జెర్సీలను సెక్యూరిటీ గార్డు దొంగిలించాడు. వీటి విలువ సుమారు రూ.6.52 లక్షలని సమాచారం. జూన్ 13న ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికి BCCI ఉద్యోగి హేమాంగ్ భరత్ కుమార్ అమీన్ జూలై 17న ఇచ్చిన పోలీస్ కంప్లైట్ తరువాతనే వెలుగులోకి వచ్చింది.
మెరైన్ డ్రైవ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత, 2023లోని సెక్షన్ 306 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దొంగతనానికి పాల్పడింది 40 ఏళ్ల ఫారూక్ అస్లామ్ ఖాన్ గా గుర్తించి అరెస్టు చేశారు.
ENG vs IND : చివరి టెస్టులో భారత్ గెలిచి సిరీస్‌ను సమం చేస్తే.. ట్రోఫీని ఎవరు తీసుకుంటారు?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జెర్సీల దొంగతనం జూన్ 13న జరిగింది. కాగా.. బీసీసీఐ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన స్టాక్ ఆడిట్ సందర్భంలో వెలుగులోకి వచ్చింది. ఆడిట్ జరుగుతున్నప్పుడు వస్తువులు కనిపించడం లేదని గుర్తించారు. వెంటనే బీసీసీఐ అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సెక్యూరిటీ గార్డు ఫారూక్ అస్లామ్ ఖాన్ ఒక భారీ కార్డ్‌బోర్డ్ పెట్టెను లాక్కెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి.
ఈ జెర్సీలను ఫారూక్ అస్లామ్ ఖాన్.. సోషల్ మీడియా ద్వారా హర్యానాకు చెందిన ఒక ఆన్‌లైన్ జెర్సీ డీలర్ తో పరిచయం పెంచుకొని అతడికి విక్రయించాడు. కొరియర్ ద్వారా వీటిని అతడికి పంపించాడు. అయితే.. ఎంత మొత్తానికి విక్రయించాడు అన్న సంగతి ఇంకా తెలియరాలేదు. వచ్చిన డబ్బులను ఆన్‌లైన్ జూద వ్యసనానికి ఖర్చు చేశానని అస్లామ్ ఖాన్ చెబుతున్నాడు. ప్రస్తుతం అతడి బ్యాంకు ఖాతాను కుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కాగా.. ఈ జెర్సీలు ఐపీఎల్‌లో 10 జట్ల ఫ్రాంఛైజీలకు చెందినవిగా తెలుస్తోంది. అయితే.. ఇవి ప్లేయర్ల కోసం ఉంచినవా లేదా ఫ్యాన్స్ కోసం ఉంచినవా అన్నది ఇంకా తెలియరాలేదు.,
ఇక పోలీసులు హర్యానాకు చెందిన ఆన్‌లైన్ డీలర్‌ను కూడా పిలిపించి విచారించారు. ఆ జెర్సీలు దొంగిలించబడినవని తనకు తెలియదని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఆఫీసులో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున.. ఈ జెర్సీలు స్టాక్ క్లియరెన్స్ అమ్మకంలో భాగంగా ఉన్నాయని సెక్యూరిటీ గార్డు చెప్పాడని అతడు చెప్పినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కేవలం 50 జెర్సీలను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.