WCL 2025 : ఏబీ డివిలియర్స్ విధ్వంసం.. రాయుడు డకౌట్, ఉతప్ప, ధావన్, రైనా విఫలం.. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్..
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.

WCL 2025 South Africa Champions won by 88 runs against India Champions
వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఛాంపియన్స్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 88 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఏబీ డివిలియర్స్ (63 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం బాదాడు. స్మట్స్ (17 బంతుల్లో 30 పరుగులు) రాణించాడు. భారత బౌలర్లలో యూసఫ్ పఠాన్, పీయూష్ చావ్లా చెరో రెండు వికెట్లు తీశారు. అభిమన్యు మిథున్ ఓ వికెట్ పడగొట్టాడు.
THE GOAT BATTING AT HIS BEST. pic.twitter.com/sY4hlKvcv7
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 22, 2025
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు ఘోరంగా విపలమైంది. ఓపెనర్లు రాబిన్ ఉతప్ప (2), శిఖర్ ధావన్ (1)లతో పాటు అంబటి రాయుడు (0), సురేశ్ రైనా (16), యూసఫ్ పఠాన్ (5), ఇర్ఫాన్ పఠాన్ (10) లు విఫలం కావడంతో 55 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ దశలో స్టువర్ట్ బిన్ని (37 నాటౌట్; 39 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), పీయూష్ చావ్లా (9)లతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 36 పరుగులు జోడించాడు. ఆ తరువాత పవన్ నేగి డకౌట్ కాగా.. వినయ్ కుమార్ (13) 18.2వ ఓవర్‌లో జట్టు స్కోరు 111 వద్ద తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ దశలో ఫ్లడ్‌లైట్ల సమస్య వచ్చింది. చాలా సేపటి వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 88 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.