PAK vs WI : పాకిస్తాన్ మీద రివేంజ్ అదుర్స్ కదూ.. వాళ్ల గడ్డ మీద వాళ్లనే 35 ఏళ్ల తర్వాత.. విండీస్ చరిత్రాత్మకం..
పాకిస్థాన్ గడ్డ పై వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 35 ఏళ్ల తరువాత అక్కడ టెస్టుల్లో గెలుపును అందుకుంది.

West Indies register first Test win in Pakistan since 1990
పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచులో 120 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ చివరి సారిగా 1990లో గెలిచింది. ఆ తరువాత మరో విజయాన్ని అందుకునేందుకు దాదాపు 35 సంవత్సరాలు పట్టింది. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ 1-1తో సమమైంది. ముల్తాన్ వేదికగానే జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే.. గుడాకేష్ మోతీ (55) హాప్ సెంచరీ చేయగా జోమెల్ వారికన్ (36), కీమర్ రోచ్ (25)లు రాణించడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బౌలర్లలో నొమన్ అలీ 6 వికెట్లతో సత్తా చాటాడు.
Jasprit Bumrah : ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా వంద శాతం ఫిట్‌నెస్ సాధిస్తే అద్భుతమేనా?
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌కు విండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. జోమెల్ వారికన్ నాలుగు, గుడాకేష్ మోతీ మూడు, కీమర్ రోచ్ రెండు వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. దీంతో విండీస్‌కు 9 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బ్రాత్‌వైట్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30)తో పాటు ఆఖరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గూడాకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) లు రెండు అంకెల స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ చెరో నాలుగు వికెట్లు తీశారు. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ సాధించారు.
దీంతో పాకిస్థాన్ ముందు 255 పరుగుల లక్ష్యం నిలిచింది. రెండో రోజు ఆట ఆఖరుకు పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 76 పరుగులతో నిలిచింది. ఇక మూడో రోజు పాక్ మరో 57 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. 133 పరుగుల వద్ద పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ ముగియగా విండీస్ విజయాన్ని అందుకుంది. విండీస్ బౌలర్లలో గోమెల్ వార్రికన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. కెవిన్ సింక్లెయిర్ మూడు, గూడాకేశ్ మోటీ రెండు వికెట్లు పడగొట్టారు.
ఈ ఓటమితో పాకిస్థాన్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది. విండీస్ తొమ్మిదో స్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జూన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.