Jasprit Bumrah : సుదీర్ఘ ఫార్మాట్‌లో బుమ్రా భవిష్యత్తు ఏంటి? వరుసగా రెండు టెస్టులు ఆడడం కష్టమేనా?
బుమ్రా.. ఈ పేరు చెబితే చాలు ప్రత్యర్థి బ్యాటర్లకు హడల్.

What is star pacer bumrah test future
బుమ్రా.. ఈ పేరు చెబితే చాలు ప్రత్యర్థి బ్యాటర్లకు హడల్. అదే సమయంలో భారత అభిమానులకు కొండంత భరోసా. బుల్లెట్ వేగంతో అతడు వేసే యార్కర్లను ఎదుర్కొనడానికి హేమాహేమీ బ్యాటర్లు ఆపసోపాలు పడుతుంటారు. అయితే.. బుమ్రా ప్రస్తుతం వెన్నుగాయంతో సతమతం అవుతున్నాడు. దీంతో అతడు వరుసగా మూడు టెస్టులు మ్యాచ్‌లు ఆడలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టెస్టు ఫార్మాట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా భవిష్యత్తు ఏంటి? అతడి స్థానంలో ఇప్పటికిప్పుడు భారత అభిమానులకు భరోసా ఇచ్చే బౌలర్ ఎవరు అన్న ప్రశ్నలు సగటు క్రీడాభిమాని మదిని తొలుస్తున్నాయి.
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోని ఆఖరి టెస్టు మ్యాచ్ సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయ్యాడు. ఐపీఎల్‌తో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఇక ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు.
ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మూడు మ్యాచులే ఆడతాడని ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సిరీస్‌కు ముందే చెప్పాడు అంటే బుమ్రా ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడిన బుమ్రా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏ రెండు ఆడతాడో చెప్పలేని పరిస్థితి ఉంది. తొలి టెస్టులో బుమ్రా ఏకంగా 43.4 నాలుగు ఓవర్లు (తొలి ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు) బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం అతడు ఇన్ని వేయడం అనేది ఓ రకంగా రిస్క్ అనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అతడు రెండో టెస్టులో ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి.
తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్య ఏకంగా ఏడు రోజుల సమయం ఉంది. ఇంతక సుదీర్ఘ విరామం దొరికినా కూడా బుమ్రా రెండో టెస్టులో ఆడడం పై ఇంకా సందేహంగానే ఉంది. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్టులో మాత్రం ఆడతాడని అంటున్నారు. అంటే ఈ లెక్కన ఒక్కో టెస్టు మ్యాచ్‌కు మధ్య ఇన్ని రోజుల విరామం బుమ్రాకు అవసరం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇది ఓ రకంగా భారత జట్టును కలవరపెట్టేదే.
WI vs AUS : వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ బిగ్‌షాక్..
ఈ క్రమంలో అతడు సుదీర్ఘ కాలం పాటు టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించలేడని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ కే ప్రాధాన్యం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ ఎవరు అన్నది చెప్పడం కష్టమే. అతడికి ప్రత్యామ్నాయ బౌలర్‌ను తయారు చేసుకోవడం పై టీమ్ఇండియా మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అటు మరో సీనియర్ పేసర్ షమీ విషయంలోనే ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడుతున్న బౌలర్లను తీసుకుంటే బుమ్రా తరువాత 37 టెస్టులు ఆడిన సిరాజ్ సీనియర్ బౌలర్. ఆకాశ్ దీప్‌కు 7 టెస్టులు, ప్రసిద్ధ్ కృష్ణలకు 4 టెస్టుల అనుభవమే ఉంది. ఇక అర్ష్‌దీప్ సింగ్ ఇంకా టెస్టుల్లో అరంగ్రేటం చేయలేదు.