WI vs AUS : వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ బిగ్‌షాక్..
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ షాకిచ్చింది.

WI vs AUS ICC punishes West Indies coach Daren Sammy
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ షాకిచ్చింది. అతడికి జరిమానా విధించింది. బార్బడోస్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న పలు నిర్ణయాలపై సామీ అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు కారణం.
అతడు లెవల్ వన్ నేరానికి పాల్పడ్డాడని, అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. ఇక సామీ తన నేరాన్ని, శిక్షను అంగీకరించడంతో తదుపరి ఎలాంటి విచారణ ఉండబోదని పేర్కొంది.
అసలేం జరిగిందంటే..?
తొలి టెస్టు మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో నాలుగు నిర్ణయాలు విండీస్ వ్యతిరేకంగా వచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశంలో కోచ్ డారెన్ సామీ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమ నుంచి చేజారిందని చెప్పుకొచ్చాడు. అంపైర్ పేరును ప్రస్తావించాడు. ఈ జట్టుకు వ్యతిరేకంగా ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు అని ప్రశ్నించాడు. ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చూసినప్పుడు ప్రశ్నలు తలెత్తుతాయని అన్నాడు.
కోచ్ డారెన్ సామీతో పాటు కెప్టెన్ రాస్టన్ ఛేజ్ కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఆటగాళ్లు తప్పు చేస్తే శిక్ష పడుతుందని, కానీ అంపైర్‌కు ఏమీ కాదని అన్నారు. ఈ మ్యాచ్‌లో ఛేజ్‌కు వ్యతిరేకంగా ఓ నిర్ణయం వచ్చింది. రెండో రోజు ఆటలో కమిన్స్ బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. అంపైర్ నిర్ణయంపై అతడు సమీక్ష కోరాడు.. అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు దగ్గరగా వచ్చినప్పుడు కొంత స్పైక్ కనిపించింది. అయినప్పటికి అతడిని థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు.
ఇక హెడ్‌కోచ్‌కు జరిమానా విధించిన ఐసీసీ, ఛేజ్‌కు మాత్రంకు ఎలాంటి శిక్ష వేయకపోవడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. ఆ తరువాత మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 190 పరుగులు మాత్రమే చేసింది. 10 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని వెస్టిండీస్ సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 310 పరుగులకు ఆలౌటైంది. 301 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన విండీస్ 141 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ 159 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.