ఎవరీ ఆదిత్య అశోక్? న్యూజిలాండ్‌ జట్టులో ఆడుతున్నాడేంటి? అతడి చేతిపై “నా దారి రహదారి” టాటూ..

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆదిత్య అశోక్ వీరాభిమాని.

ఎవరీ ఆదిత్య అశోక్? న్యూజిలాండ్‌ జట్టులో ఆడుతున్నాడేంటి? అతడి చేతిపై “నా దారి రహదారి” టాటూ..

Adithya Ashok (Image Credit To Original Source)

Updated On : January 11, 2026 / 6:38 PM IST
  • ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
  • జట్టులో ఆదిత్య అశోక్
  • నాలుగేళ్ల వయసు వరకు ఇండియాలోనే అశోక్‌

Adithya Ashok: ఇండియా, న్యూజిలాండ్ మధ్య వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో కివీస్‌ తరఫున లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ ఆడుతున్నాడు. అతడు జన్మించింది తమిళనాడులోని వెల్లూరులో. ఆదిత్య అశోక్ నాలుగేళ్ల వయసు వరకూ భారతదేశంలోనే నివసించాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం అతడి తల్లిదండ్రులు ఆక్లాండ్‌కు వెళ్లారు.

ఆక్లాండ్ దేశీయ క్రికెట్ వ్యవస్థలో ఆదిత్య క్రమంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 2020 అండర్-19 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2021 డిసెంబర్‌లో ఆక్లాండ్ తరఫున తన తొలి ప్రొఫెషనల్ టీ20 మ్యాచ్ ఆడిన తరువాత.. అన్ని ఫార్మాట్లలోనూ స్థిర ఆటగాడిగా మారాడు. 2022-23 సీజన్ అతని కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఆ సీజన్‌లో న్యూజిలాండ్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు.

Also Read: 365 Buttons Trend: 2026లో తొలి వైరల్ మూమెంట్ ఇదే.. ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.. 365 బటన్‌లు అంటే ఏంటి?

అశోక్ అంతర్జాతీయ కెరీర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు. కొన్ని నెలల తర్వాత బంగ్లాదేశ్‌పై జరిగిన సిరీస్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఆపై వెన్నెముక గాయం కారణంగా దీర్ఘకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇప్పటివరకు మూడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రెండు వికెట్లు సాధించాడు.

రజనీకాంత్‌కు వీరాభిమాని
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఆదిత్య అశోక్ వీరాభిమాని. తన చేతి మీద “ఎన్ వళి తని వళి” (నా దారి రహదారి) అనే తమిళ వాక్యాన్ని టాటూగా వేయించుకున్నాడు. ఇది పదయప్ప (తెలుగులో నరసింహా) సినిమాలోని పాపులర్ డైలాగ్.

తన తాతతో కలిసి చూసిన చివరి సినిమా కావడం వల్ల దీనికి అశోక్‌ జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అశోక్‌ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీలో పలు వారాలు శిక్షణ కూడా తీసుకున్నాడు.

భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమిసన్, ఆదిత్య అశోక్.