తన దేశం తొలి ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. చిన్న వయస్సులోనే అనేక బౌలింగ్ రికార్డులను బద్దలు కొట్టిన రషీద్ ఖాన్.. టీ20 బౌలర్లలో నంబర్ వన్‌గా ఉన్నారు.
ఆజాది రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ మాట్లాడుతూ.. “ఆఫ్ఘనిస్తాన్ గెలిచిన తరువాతే నేను చేసుకుంటాను” అని అన్నారు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఓడించినప్పుడు టెస్ట్ మ్యాచ్‌కు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడుగా రషీద్ రికార్డులకెక్కాడు. రషీద్ కెరీర్‌లో అత్యుత్తమ 6/49 గణాంకాలు ఆఫ్ఘనిస్థాన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాయి.
టీ20 క్రికెట్‌లో 290 వికెట్లు పడగొట్టి తమ దేశం తరఫున ఈ ఘనతను అందుకున్న ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. రషీద్ ఖాన్ ఆఫ్గాన్ తరఫున 7 టెస్టులు, 67 వన్డేలు, 48 టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపుతిప్పాడు.
రషీద్ మార్చి నుంచి పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐర్లాండ్ సిరీస్ తర్వాత అతను ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రషీద్ ఆడుతున్నాడు. 2017 నుంచి ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు రషీద్.
2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రషీద్ 2019 ప్రపంచకప్‌లో అఫ్గాన్ తరఫున బరిలోకి దిగాడు. అయితే అఫ్గాన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇక కరోనా పుణ్యమా అని ఇంటికే పరిమితమైన రషీద్.. ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నాడు.