END vs AUS : ఇంగ్లాండ్ పై ఘన విజయం.. సెమీస్‌కు మరింత చేరువైన ఆస్ట్రేలియా
వన్డే ప్రపంచకప్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత పుంజుకుంది. వరుసగా ఐదో మ్యాచులోనూ విజయం సాధించింది.

END vs AUS
England vs Australia: వన్డే ప్రపంచకప్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత పుంజుకుంది. వరుసగా ఐదో మ్యాచులోనూ విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో తన సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది. 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మెగాటోర్నీలో ఆసీస్ మరో రెండు మ్యాచులు ఆఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లతో ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచుల్లో విజయం సాధించినా కూడా ఆస్ట్రేలియా సెమీస్ బెర్తు ఖాయం కానుంది.
287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 48.1 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ (64; 90 బంతుల్లో 2 ఫోర్లు, 3సిక్సర్లు), డేవిడ్ మలన్ (50; 64 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. మొయిన్ అలీ (42) రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, హేజిల్‌వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. స్టోయినిస్ ఓ వికెట్ సాధించాడు.
Australia make it five wins in a row with their 33-run win #CWC23
— cricket.com.au (@cricketcomau) November 4, 2023
ఆదుకున్న లబుషేన్..
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ (71; 83 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. స్టీవ్ స్మిత్ (44; 52 బంతుల్లో 3 ఫోర్లు), కామెరూన్ గ్రీన్ (47; 52 బంతుల్లో 5 ఫోర్లు), మార్కస్ స్టోయినిస్ (35) ఆఖరిలో ఆడమ్ జంపా (29; 19 బంతుల్లో 4 ఫోర్లు) లు రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ లు చెరో రెండు వికెట్లు తీశారు. డేవిడ్ విల్లీ, లివింగ్ స్టోన్ లు ఒక్కొ వికెట్ సాధించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ట్రావిడ్ హెడ్ (11), డేవిడ్ వార్నర్ (15)లు విఫలం అవ్వడంతో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టీవ్ స్మిత్, లబుషేన్‌లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయడం ద్వారా ఆదిల్ రషీద్ విడగొట్టాడు. మరికాసేపటే జోష్ ఇంగ్లిస్ (3)ను ఆదిల్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా 117 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
అప్పటికే క్రీజులో కుదురుకున్న లబుషేన్‌కు గ్రీన్ జత కలిశాడు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో 63 బంతుల్లో లబుషేన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా వెలుతున్న అతడిని మార్క్‌వుడ్ ఔట్ చేశాడు. కాసేపటికే గ్రీన్‌ను డేవిడ్ విల్లీ బోల్తా కొట్టించాడు. స్టోయినిస్, కమిన్స్ (10) కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో 247 పరుగులకే ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆఖర్లో ఆడమ్ జంపా రాణించడంతో ఆసీస్ స్కోరు 280 పరుగులు దాటింది.